తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, జూన్ 26:
తాళ్లపూడి మండలంలో కాపులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ వైసీపీ నాయకుడు తోట రామకృష్ణ చేసిన వ్యాఖ్యలను కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు కూటమి నాయకులు మాట్లాడుతూ వైసీపీ నాయకుల ఆరోపణలను తిప్పికొట్టారు.
తాళ్లపూడి మండల టీడీపీ అధ్యక్షుడు సిద్దా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, 2014 ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీ జాబితాలో చేర్చేందుకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, అయితే కేంద్ర ప్రభుత్వం జాప్యం కారణంగా అది అమలులోకి రాలేదన్నారు. కాపుల కోసం టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్య పథకాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసిందని విమర్శించారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను వైసీపీ నాయకులు పేర్ని నాని, అంబటి రాంబాబు వంటి వారితో విమర్శింపజేసిన విషయం తోట రామకృష్ణకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కాపులపై కపట ప్రేమ ప్రదర్శిస్తూ కొందరు రాజకీయ నిరుద్యోగులు కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
చాగల్లు జనసేన మండల అధ్యక్షుడు ఉప్పులూరు చిరంజీవి మాట్లాడుతూ, వైసీపీలో ఉన్నవారే కాపులు కాదని, అన్ని పార్టీల్లోనూ కాపు నాయకులు ఉన్నారని అన్నారు. కూటమి నాయకుడు గంగుమల్ల స్వామిపై జరిగిన చిన్న వివాదాన్ని పెద్దది చేసి రాజకీయ రంగు పులుముతున్నారని, ఆ సమస్యను పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించుకున్నామని చెప్పారు. ఇదే తోట రామకృష్ణను గతంలో సొంత వైసీపీ నాయకులే సమావేశంలో అవమానించిన విషయాన్ని గుర్తు చేశారు.
కాపవరం సొసైటీ అధ్యక్షుడు సుంకర సత్తిబాబు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ మరియు ఆయన కుటుంబంపై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించని వారు ఇప్పుడు కాపులపై ప్రేమ చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు రామానాయుడు, దుర్గేష్ వంటి వారికి కీలక పదవులు, ఉన్నత శాఖలు కేటాయించి గౌరవం కల్పించిందని పేర్కొన్నారు.
మద్దూరు మాజీ సర్పంచ్ మాట్లాడుతూ, తోట రామకృష్ణ తనను కాపు జేఏసీ నాయకుడిగా చెప్పుకోవడం కంటే “వైసీపీ కాపు జేఏసీ” నాయకుడిగా చెప్పుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో అరాచకాలకు తావు లేదని, కూటమిలోని కాపు నాయకులంతా ఐక్యతతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


