డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : మలికిపురం మండలం లక్కవరంలో గురువారం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణంరాజు విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్లలోపు వినియోగం ఉన్న కుటుంబాల కోసం ప్రవేశపెట్టిన 2 కిలోవాట్ల ఉచిత సోలార్ పథకాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే పథకం అమలులో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్లను కోరారు.
సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో భవనాలకు చేసే రంధ్రాల వల్ల వర్షపు నీరు లీక్ అవుతోందని, వాటిని ప్రత్యేక వాటర్‌ప్రూఫ్ గమ్‌తో పూడ్చాలని సూచించారు. ఇళ్లు లేని పేదలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రస్తుతం రేపవర్ కంపెనీ సోలార్లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంటూ, టాటా, లూమినస్, వి-గార్డ్, మైక్రోటెక్ వంటి ప్రముఖ బ్రాండ్ల ప్యానెళ్లను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. అలాగే లబ్ధిదారుల ఖాతాల్లో స్థల భాటా కింద ప్రతి నెలా రూ.200 జమ చేయాలని కోరారు.
200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే బీసీ, ఓసీ పేద కుటుంబాలకు కూడా ఈ ఉచిత సోలార్ పథకాన్ని వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున రుద్రరాజు గోపాలకృష్ణంరాజు డిమాండ్ చేశారు.
Uploaded Video:

