నిజాం నిరంకుశ పాలన, కాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల అరాచకాలను తన కలంతో ఎండగట్టిన ప్రముఖ పాత్రికేయుడు సోయబ్ ఉల్లా ఖాన్ వర్ధంతి నేడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన సోయబ్ ఉల్లా ఖాన్, ‘ఇమ్రోజ్’ పత్రిక ద్వారా ప్రజల కష్టాలను, రజాకార్ల దురాగతాలను వెలుగులోకి తీసుకువచ్చారు. బెదిరింపులు, ఒత్తిళ్లకు ఏమాత్రం లొంగకుండా సత్యానికి, ప్రజల పక్షాన నిలిచారు.
హైదరాబాద్‌లో రజాకార్ల ఆగడాలను నిర్భయంగా రాసిన ఆయనపై తీవ్ర ఆగ్రహం పెంచుకున్న రజాకార్లు 1948 ఆగస్టు 22న దాడికి పాల్పడ్డారు. సోయబ్ ఉల్లా ఖాన్‌పై కత్తులతో దాడి చేసి, ఆయన చేతులను నరికివేసి, అనంతరం కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని అన్యాయాన్ని ప్రశ్నించిన ఆయన జీవితం నేటి పాత్రికేయులకు స్ఫూర్తిదాయకం. నిజం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ఆయన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వేచ్ఛా భావ వ్యక్తీకరణకు, నిర్భయ పాత్రికేయతకు సోయబ్ ఉల్లా ఖాన్ ఒక ప్రతీకగా నిలిచారు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రజలు, పాత్రికేయులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. అక్షరం ఉన్నంత వరకు సోయబ్ ఉల్లా ఖాన్ అమరుడే.



