*సచివాలయ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలి: సీ. శ్రీనివాసులు,*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 20 వాకాడు మండలం,*
వాకాడు మండల సచివాలయాల ఇంచార్జి అధికారి శ్రీ సీ. శ్రీనివాసులు గురువారం వాకాడు–1, వాకాడు–2 గ్రామ సచివాలయాలను తనిఖీ చేసి, అక్కడి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయాల్లో సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవల తీరును ఆయన పరిశీలించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, సచివాలయంలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ బాధ్యతలను ప్రతి ఒక్కరూ అంకితభావంతో, సమయపాలనతో నిర్వహించాలని స్పష్టం చేశారు. సచివాలయానికి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజల పట్ల సిబ్బంది గౌరవపూర్వకంగా, మర్యాదగా వ్యవహరించాలని కోరారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను సకాలంలో అందిస్తూ, వారి సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ–కేవైసీ కార్యక్రమంలో మరింత పురోగతి సాధించేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. అదేవిధంగా పిల్లల ఆధార్ నమోదు, ఆధార్‌కు సంబంధించిన సేవలు, మన మిత్ర సర్వే తదితర ప్రభుత్వ కార్యక్రమాలు, సర్వేల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో పురోగతి సాధించేందుకు పంచాయతీ కార్యదర్శులు సిబ్బందితో సమన్వయం చేసుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని శ్రీనివాసులు ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన సూచించారు.



