వాగులో పడిన కారు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
అంజనాపురం సమీపంలో ప్రమాదం..
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ సెప్టెంబర్ 9
ఖమ్మం:
కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలోని నిమ్మవాగు బ్రిడ్జిపై కారు అదుపుతప్పి వాగులో పల్టీలు కొట్టిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. బ్రిడ్జిపై ఉన్న గోతులను తప్పించబోయే క్రమంలో కారు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, తృటిలో ప్రాణాపాయం తప్పింది.
స్థానికుల వివరాల ప్రకారం.. ఏన్కూరు నుంచి ఖమ్మం వైపు కారు వెళ్తుండగా అంజనాపురం గ్రామ సమీపంలోని నిమ్మవాగు బ్రిడ్జిపైకి చేరుకుంది. బ్రిడ్జిపై ఏర్పడిన గోతులను తప్పించుకునే క్రమంలో కారు అదుపుతప్పి బ్రిడ్జి పక్క నుంచి వాగులోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది.
ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అంజనాపురం సమీపంలోని నిమ్మవాగు బ్రిడ్జిపై గోతులు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎదురుగా వాహనాలు వచ్చిన సమయంలో గోతులను తప్పించుకునే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్రిడ్జిపై ఏర్పడిన గోతులను వెంటనే పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.


