అనకాపల్లి జిల్లా ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
ఎస్.రాయవరం మండలంలోని వరహానది ఆయకట్టు పారుదల కాలువ దిగువ ప్రాంతంలో సుమారు 3,600 ఎకరాల వ్యవసాయ భూములకు నీరు పారేందుకు ఇబ్బందులు కలిగే విధంగా కాలువకు అడ్డంగా సిమెంట్ కాంక్రీట్‌తో గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టడంపై దిగువ ప్రాంత రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెంకటాపురం తదితర ప్రాంతాలకు చెందిన కొందరు మండల స్థాయి నాయకులు, సంబంధిత ప్రజాప్రతినిధుల సహకారంతో ఆదివారం సెలవు రోజును అవకాశంగా తీసుకొని కాలువకు అడ్డంగా సిమెంట్ కాంక్రీట్ గోడ నిర్మాణ పనులు చేపట్టారని గ్రామస్తులు ఆరోపించారు.
ఈ గోడ నిర్మాణం వల్ల దిగువ ప్రాంతంలోని మూడు గ్రామాలకు చెందిన సుమారు 3,600 ఎకరాల వ్యవసాయ భూములకు పారుదల నీరు సక్రమంగా అందక తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువకు అడ్డంగా గోడ నిర్మించడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందని, ఈ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
ఈ నిర్మాణ పనులకు సంబంధించి వర్క్ ఆర్డర్ గానీ, సంబంధిత శాఖల అనుమతులు గానీ ఉన్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. గోడ నిర్మాణాన్ని నిలిపివేయాలని దిగువ ప్రాంతంలోని మూడు గ్రామాల ప్రజలు అడ్డుపడుతున్నప్పటికీ, పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆరోపించారు.
ఈ అక్రమ నిర్మాణంపై సోమవారం సంబంధిత డీఈ (డిప్యూటీ ఇంజినీర్) అధికారికి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు ఉప్పరాపల్లి గ్రామానికి చెందిన సుందరపు ఈశ్వరరావు, తేటకలి సత్యనారాయణ, ఇతర గ్రామ పెద్దలు తెలియజేసారు .


