మైదుకూరు మండలం వనిపెంటలో బాలికల గురుకుల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ గారు, జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారు మరియు మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు హాజరై కళాశాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి సవితమ్మ గారు మాట్లాడుతూ, మైదుకూరు నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు చేస్తున్న కృషిని అభినందించారు. కళాశాలకు అవసరమైన అన్ని వసతులను కల్పించి, విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి వాటి ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు మాట్లాడుతూ, వనిపెంట బాలికల గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేసి ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభించేందుకు సహకరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యా, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, ఇన్‌చార్జి మంత్రి శ్రీమతి సవితమ్మ గారికి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ ప్రాంత బాలికలకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ జూనియర్ కళాశాల ద్వారా విద్యార్థినులు ఉన్నత విద్యావకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.






