– రూ.40 లక్షల ఎండోమెంట్ నిధులతో నూతన ఆలయ నిర్మాణం
– భక్తులకు త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్ష
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం మూగవారిపల్లి బీసీ కాలనీలో శ్రీ వినాయక స్వామివారి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎండోమెంట్ శాఖ నిధులు రూ.40 లక్షలతో చేపట్టనున్న ఆలయ నిర్మాణ పనులకు ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని, వినాయక స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్నో ఏళ్లుగా గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్రంగా ఉన్న ఆలయానికి నూతన నిర్మాణం చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


