ఆగి ఉన్న ట్రాలీని వెనుక నుంచి ఢీకొన్న ఫ్రూట్స్ లోడ్ టాటా ఇంట్రా వ్యాన్.. డ్రైవర్, క్లీనర్ మృతి
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )
యలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 5 గంటల సమయంలో తుని నుంచి అనకాపల్లి వైపు ఫ్రూట్స్ లోడ్‌తో వెళ్తున్న AP 39 WR 3630 నంబర్ గల టాటా ఇంట్రా వ్యాన్.. రహదారి పక్కన నిలిపి ఉన్న OD 07 BG 0870 నంబర్ గల ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవారిగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించే చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


