విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి )| ఆగస్టు 17:
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు, యువతకు మెరుగైన చదువుల వాతావరణం కల్పించేందుకు ప్రతి గ్రామంలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని ప్రజా సంకల్ప వేదిక విద్యార్థి విభాగం జాతీయ ఉపాధ్యక్షులు బొద్దపు బంగార్రాజు పేర్కొన్నారు.
గ్రామాల్లో చదువుకున్న యువతలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్స్, పోలీస్, బ్యాంకింగ్, రైల్వే, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. వారికి అవసరమైన పుస్తకాలు, దినపత్రికలు, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, మోడల్ పేపర్లు, పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
ప్రతి గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండేలా గ్రంథాలయ సదుపాయం ఉంటే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ప్రశాంతంగా చదువుకోవడంతో పాటు, ఖరీదైన పుస్తకాలను ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన అవసరం తగ్గుతుందని బొద్దపు బంగార్రాజు పేర్కొన్నారు.
అలాగే గ్రంథాలయాల్లో డిజిటల్ సదుపాయాలు, ఆన్లైన్ విద్యా వనరులు అందుబాటులోకి తీసుకువస్తే గ్రామీణ యువతకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్తుకు గ్రంథాలయాలు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు.
ప్రతి గ్రామంలో గ్రంథాలయం – ప్రతి యువతకు విజ్ఞానం – ప్రతి పోటీ పరీక్షార్థికి మంచి వేదిక – ప్రతి విద్యార్థి లక్ష్యానికి విజయబాట అనే లక్ష్యంతో గ్రంథాలయాలను మరింత బలోపేతం చేయాలని బొద్దపు బంగార్రాజు ఆకాంక్షించారు.


