యలమంచిలి: పున్నమి ప్రతినిధి ఆనంద్ :
బహుళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించేందుకు డిజిటల్ హెల్త్ టూల్స్‌ను సమర్థవంతంగా వినియోగించడంపై అనకాపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ప్రాజెక్టులో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (యమ్ వో యు) ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎంహెచ్ వో డా. అచ్యుతకుమారి సహకారం, మార్గదర్శకత్వంతో సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్ (సిసి డిసి) ఆధ్వర్యంలో శిక్షణ జరిగింది. ఈ శిక్షణలో బహుళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రాథమిక ఆరోగ్య స్థాయిలో సమగ్ర వైద్య సేవలు అందించడంలో డిజిటల్ ఆరోగ్య సాంకేతికతలను ఎలా వినియోగించాలనే అంశాలపై వైద్యాధికారులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (ఇడి యస్ యస్), అసిస్టెడ్ టెలిమెడిసిన్ తదితర డిజిటల్ హెల్త్ విధానాలపై శిక్షణ ఇచ్చారు. రోజువారీ వైద్య సేవల్లో ఈ టూల్స్‌ను ఉపయోగించే విధానం, వాటి ద్వారా రోగులకు నిరంతర వైద్య సేవలు అందించే విధానాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో డా. నిఖిల్ ఎస్.వి., సీనియర్ సైంటిస్ట్, డా. బాలాజీ గుమ్మిడి, మేనేజర్ – రీసెర్చ్ & ఆపరేషన్స్, డా. మోనల్, ఎం డి జనరల్ మెడిసిన్, గోపీ, ప్రాజెక్ట్ ఆఫీసర్, కె. శివ ప్రసాద్, రీసెర్చ్ ఫెలోతో పాటు 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యాధికారులు, జిల్లా ఎన్సిడి సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో డిజిటల్ హెల్త్ టెక్నాలజీల వినియోగాన్ని బలోపేతం చేయడం, ముఖ్యంగా బహుళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సమర్థవంతమైన, సమగ్ర, నిరంతర వైద్య సేవలు అందించేలా వైద్యాధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.


