ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవుడు మాన్యం భూముల సర్వే వివాదానికి దారితీసింది. అధికారిక రికార్డుల ప్రకారం ఆలయానికి సుమారు 150 ఎకరాల భూమి ఉండగా, ప్రస్తుతం 120 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో మిగిలిన భూములు అన్యాక్రాంతమయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో వరంగల్ ఎండోమెంట్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు గురువారం సర్వేయర్ గ్రామానికి చేరుకుని భూముల సర్వే చేపట్టారు. అయితే ఈ సర్వేలో గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములకు మాత్రమే హద్దులు నిర్ణయించడం, ఇతర వర్గాలకు చెందిన భూములను సర్వే చేయకపోవడం స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.
స్థానికుల ఆరోపణల ప్రకారం, తరతరాలుగా శిస్తు చెల్లిస్తూ సాగు చేస్తున్న గిరిజన రైతుల భూములనే లక్ష్యంగా చేసుకుని సర్వే నిర్వహించారని, ఆలయ భూములను ఆక్రమించారని చెబుతున్న ఇతర భూములను మాత్రం అధికారులు పరిశీలించలేదని అంటున్నారు. ముఖ్యంగా ముస్లిం, అగ్రవర్ణాలకు చెందిన భూములను సర్వే పరిధిలోకి తీసుకురాకపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల ఆరోపణల ప్రకారం, స్థానిక ఆలయ ఈవో వేణుగోపాలాచార్యులు, ఆలయ ఇన్స్పెక్టర్ సమత, ఆలయ గుమస్తాలు తదితరులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, పై అధికారుల ఒత్తిడి కారణంగానే అసలు ఆక్రమణలకు గురైన భూముల జోలికి వెళ్లడం లేదని ఆరోపిస్తున్నారు.
దేవుడి మాన్యం భూములు పూర్తిస్థాయిలో రికార్డుల ప్రకారం గుర్తించి, ఎవరి ఆక్రమణలో ఉన్నా ఒకే విధంగా సర్వే నిర్వహించాలని, గిరిజన రైతులపైనే చర్యలు కేంద్రీకరించడం సరికాదని స్థానికులు పేర్కొంటున్నారు.
అలాగే ఆలయానికి చెందిన మొత్తం భూములపై సమగ్ర సర్వే నిర్వహించి, అన్యాక్రాంతమైన భూములను వెలికితీసి ఆలయ ఆధీనంలోకి తీసుకురావాలని, సర్వే ప్రక్రియలో పారదర్శకత పాటించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

