నందలూరు లోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల చివరి రోజైన గురువారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా, ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో అర్చకులు,అధికారులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.
ఉదయం 7.30 నుండి 8.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీసౌమ్యనాథస్వామివారికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉదయం 9.15 నుండి 10.15 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీ సౌమ్యనాథ స్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ధూపదీప నైవేద్యం, రాజోపచారాలు, అర్ఘ్యపాద నివేదనలతో పాటు పాలు, తేనె, కొబ్బరినీరు, పసుపు, గంధంతో శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణల ద్వారా వైఖానస ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు.
అనంతరం ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం ఘనంగా జరిగింది.ఈసందర్భంగా ఉపనిషత్తులు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం,విష్ణుసూక్తం తదితర పంచసూక్త మంత్రాలతో పాటు దివ్యప్రబంధ పారాయణం టీటీడీ వేదపారాయణదారులు నిర్వహించారు. ప్రతి క్రతువులో ఉత్తమ జాతి పుష్పమాలలతో స్వామివారిని,అమ్మవార్లను సుందరంగా అలంకరించారు.
లోకక్షేమార్థం చక్రస్నానం
తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన సమస్త సేవలు సఫలమై, లోకక్షేమం, సకాల వర్షాలు, ప్రజల ఆయురారోగ్యాలు, భక్తుల సుఖశాంతులు, సర్వమంగళం కోసం చక్రస్నానం నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు పాపవిముక్తులై,శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో ధనధాన్య సమృద్ధిని పొందుతారని ఆగమ శాస్త్రాలుపేర్కొంటున్నాయి.
సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు నవసంధి, మాడవీధి ఉత్సవం నిర్వహించనుండగా, రాత్రి 7 నుండి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రవి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ దిలీప్, అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



