పుట్టినరోజు వేడుకల పేరుతో తల్వార్లు, కత్తులు వంటి ఆయుధాలతో విన్యాసాలు చేస్తూ వాటిని వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ముగ్గురిపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు టూ టౌన్ ఎస్సై రమేష్ తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను పోలీసు సోషల్ మీడియా బృందం పరిశీలించి, నగరానికి చెందిన షేక్ ఖాదర్, సయ్యద్ సమీర్, ఖమ్మం రూరల్ మండలానికి చెందిన షేక్ సమీర్లను గుర్తించినట్లు చెప్పారు. వీరిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాల ప్రదర్శన, ప్రమాదకర విన్యాసాలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను ఏమాత్రం సహించబోమని ఎస్సై రమేష్ హెచ్చరించారు. పుట్టినరోజు వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. రోడ్లపై ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వేడుకలు నిర్వహించడం, ఆయుధాలతో విన్యాసాలు చేయడం, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దన్నారు. వైరల్ వీడియోల ఆధారంగా కూడా విచారణ జరిపి బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.



