ట్రాఫిక్ నిబంధనలు.. సైబర్ నేరాలపై అవగాహన
మిర్ఖాన్‌పేట్‌లో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
మిర్ఖాన్‌పేట్: ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు శనివారం పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ, ట్రాఫిక్ సీఐ, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ సీఐ బి. సత్యనారాయణ, ఎస్‌ఐలు సునీల్, సైదులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. రహదారిపై ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
అలాగే ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్ లింకులు, ఓటీపీ, క్యూఆర్ కోడ్ మోసాలు, సోషల్ మీడియా భద్రత, వ్యక్తిగత సమాచార గోప్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులను నమ్మవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.



