బద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం సెప్టెంబర్,4,(పున్నమి ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిర్పోర్టు నిర్మాణానికి అనువైన ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణకు రానుంది. గతంలో పరిశీలించిన రెండు ప్రాంతాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలడంతో, తాజాగా నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, రన్వే నిర్మాణానికి అనుకూలత, ఇతర సాంకేతిక అంశాలను కేంద్ర బృందం పరిశీలించనుంది. సాంకేతిక నివేదిక అనుకూలంగా వస్తే విమానాశ్రయం ఏర్పాటుకు తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.



