*ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు నూతన దరఖాస్తుల స్వీకరణ*
*అర్హులైన వారందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలి*
–జిల్లా కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి
విజయనగరం, జిల్లా బ్యూరో రమణ/సెప్టెంబర్ 07: పున్నమి ప్రతినిధి)
ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల నుండి నూతన పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లాలోని స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించారు.
వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సంప్రదాయ చెప్పుల తయారీదారులు, కల్లు గీత కార్మికులు, ట్రాన్స్జెండర్లకు సంబంధించిన పింఛన్ కేటగిరీలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
నూతన పింఛన్ దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ ధృవీకరణ ప్రక్రియను సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. అనంతరం సాధారణ అర్హత ధృవీకరణ, భౌతిక పరిశీలన, సంబంధిత శాఖల పరిశీలన, అర్హత నిర్ధారణ, సిఫార్సు, బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోదం వంటి ప్రక్రియలను నిర్దేశిత కాలపట్టిక ప్రకారం పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.
పింఛన్ రకాన్ని బట్టి అవసరమైన ధృవీకరణ పత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. వృద్ధాప్య పింఛన్‌కు ఆధార్ కార్డు ద్వారా వయస్సు నిర్ధారణ, వితంతు పింఛన్‌కు భర్త మరణ ధృవీకరణ పత్రం, దివ్యాంగులకు 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు సదరం ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఇతర వృత్తిపరమైన పింఛన్లకు సంబంధిత శాఖల ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
నూతన పింఛన్ల మంజూరు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకం ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పింఛన్ల మంజూరు విషయంలో ఎటువంటి మధ్యవర్తులు, దళారులను నమ్మవద్దని, కేవలం స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బందిని మాత్రమే సంప్రదించాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. మరిన్ని వివరాల కోసం డీఆర్డీఏ కార్యాలయంలోని 8008203971 ఫోన్ నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.


