ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత
• పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో 226 వినతులు స్వీకరణ –రెవెన్యుకి సంబంధించిన వినతులు 113
• రెవెన్యూ, భూసర్వే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత
• పెండింగ్ అర్జీలను సత్వరం పరిష్కరించాలి
• ఫిర్యాదుదారుడితో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే నివేదిక ఇవ్వాలి
• 1100 టోల్‌ఫ్రీ వినతుల పరిష్కారంలోనూ జాప్యం ఉండకూడదు
– జిల్లా జాయింట్ కలెక్టర్ సెతు మాధవన్
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, సెప్టెంబర్ 7. ( పున్నమి ప్రతినిధి )
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ సెతు మాధవన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమంలో జిల్లా జాయిటు కలక్టరు ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి మొత్తం 226 వినతులు స్వీకరించగా, అందులో 113 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రతి ఫిర్యాదును ఆయన స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. సమస్యల స్వభావాన్ని బట్టి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అర్హత కలిగిన ప్రతి ఫిర్యాదుదారునికి నిబంధనల మేరకు న్యాయం జరిగేలా చూడాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా, అందిన ప్రతి ఫిర్యాదును నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పరిష్కరించిన ఫిర్యాదులపై సంబంధిత ఫిర్యాదుదారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. ప్రతి వినతిని కేవలం ఒక అర్జీగా కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యగా పరిగణించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సెతు మాధవన్ రెవెన్యూ, జిల్లా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి, పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, భూసర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పీజీఆర్ఎస్లో రెవెన్యూ, భూ వివాదాలు, భూసర్వే తదితర సమస్యలకు సంబంధించిన వినతులు అధికంగా వస్తున్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూ సమస్యలను కేవలం కార్యాలయ స్థాయి రికార్డులు, నివేదికల ఆధారంగా పరిష్కరించకుండా, అవసరమైన చోట క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి, ఫిర్యాదుదారుడితో మాట్లాడి, రికార్డులను పరిశీలించిన అనంతరం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, “ప్రతి అర్జీదారుడితో నేరుగా మాట్లాడిన తర్వాతే నివేదిక ఇవ్వాలని, అర్జీదారుడితో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలి” అని ఆదేశించారు. ప్రజలు ఒకే సమస్యతో పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా, అర్జీ స్వీకరణ నుంచి పరిష్కారం వరకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 1100 టోల్‌ఫ్రీ సేవల ద్వారా అందుతున్న వినతులను కూడా అత్యంత బాధ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు 1100 సేవలను విస్తృతంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో శాఖల వారీగా నమోదైన వినతులు: రెవెన్యూ – 113, పంచాయతీరాజ్ – 24, డీఆర్డీఏ – 34, విద్యుత్ శాఖ-5, గ్రామ సచివాలయ శాఖ – 9, విద్యా శాఖ– 5, విద్యుత్ – 4, మున్సిపల్ – 15, డిఎం అండ్ హెచ్ఒ-6, ఇతర శాఖలు –15. మొత్తం – 226 వినతులు నమోదు అయ్యాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఇ. మురళి, జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అరుణకుమారి, వెంకటరెడ్డి, సూర్యకళ, ఆర్డీవోలు సుధారాణి, సుధసాగర్, జగన్నాధరావు, సీపీవో బాలాజి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి, హౌసింగ్ పీడీ మురళీమోహన్, జిల్లా భూ సర్వే రికార్డ్స్ శాఖ సహాయ సంచాలకులు ఆర్.విజయకుమార్, డీపీవో మల్లిఖార్జున్, డి.ఇ.ఒ మణిక్యంనాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో దేవిప్రసాద్, మండల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



