రాజన్న సిరిసిల్ల జూలై 30 ( పున్నమి ప్రతినిధ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర (భీమేశ్వర) స్వామి దేవస్థానంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మూడు రోజుల వరుణ యాగం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వారు ప్రార్థించారు. మూడు రోజులపాటు ఈ వరుణ యాగం కొనసాగనుంది.



