అవగాహన ర్యాలీని విజయవంతం చేసిన డాక్టర్ షేక్ మష్కూర్ అహ్మద్, సిబ్బంది
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆత్మకూరు పట్టణంలోని యూపీహెచ్‌సీ అరుంధతివాడ పరిధిలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్ షేక్ మష్కూర్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైద్య సిబ్బంది, స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మష్కూర్ అహ్మద్ మాట్లాడుతూ.. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దోమల నివారణే డెంగ్యూ నియంత్రణకు ప్రధాన మార్గమని, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జ్వరం, ఒంటి నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని, స్వయం వైద్యం ప్రమాదకరమని హెచ్చరించారు.ర్యాలీలో ఎం.పీ.హెచ్.ఈ.ఓ సుధాకర్, హెచ్‌వీ పార్వతి పాల్గొని డెంగ్యూ వ్యాప్తి చెందే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. హెల్త్ అసిస్టెంట్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ‘డ్రై డే’గా పాటించి నిల్వ నీటిని తొలగించాలని ప్రజలను కోరారు.డెంగ్యూ నివారణ నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.ఈ అవగాహన ర్యాలీలో యూపీహెచ్‌సీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


