*హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా సాధించాలి–
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
————————————————-
జనగామ, ఆగష్టు 18,పున్నమి జిల్లా ప్రతినిధి :
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు సంబంధించి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను సత్వరమే పూర్తి చేయాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధికారులను ఆదేశించారు.
మంగళవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత అధికారులతో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* గూగుల్ మీట్ ద్వారా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, ఎన్సీడీ స్క్రీనింగ్ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. జిల్లాకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు (5,674) మంది లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు (2,466) మందికి టీకాలు అందించినట్లు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
14 నుంచి 15 సంవత్సరాల వయసులోపు పిల్లలందరికీ హెచ్‌పీవీ టీకా అందేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
ముఖ్యంగా మోడల్ స్కూళ్లు, కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న అర్హత కలిగిన పిల్లలకు టీకాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
హెచ్‌పీవీ టీకా ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే ప్రయోజనాలపై పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని *కలెక్టర్* సూచించారు. తల్లిదండ్రుల సమ్మతితో టీకాలు అందించాలని, ఎక్కడైనా అవసరం ఉంటే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, వ్యాక్సినేషన్ లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. ప్రతిరోజు వ్యాక్సినేషన్ పురోగతిని ఆన్లైన్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు.
లక్ష్య సాధనలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా విద్యా శాఖ అధికారుల సహకారంతో పాఠశాలల వారీగా అర్హులైన పిల్లలను గుర్తించి, వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఈ నెలాఖరులోగా జిల్లాకు నిర్దేశించిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ సురక్షితమైన, సమర్థవంతమైన టీకా అని, హెచ్‌పీవీతో సంబంధం ఉన్న వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని *కలెక్టర్* పేర్కొన్నారు. ప్రజల్లో అపోహలు లేకుండా టీకాపై సరైన అవగాహన కల్పించాలన్నారు.
*ఎన్సీడీ స్క్రీనింగ్‌పై ప్రత్యేక దృష్టి*
జిల్లాలో అసంక్రమిత వ్యాధుల (NCD – Non-Communicable Diseases) నియంత్రణలో భాగంగా ప్రజలకు విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని *కలెక్టర్* ఆదేశించారు. గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు వంటి అసంక్రమిత వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు ప్రతి ఒక్కరికీ అవసరమైన పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
స్క్రీనింగ్‌లో వ్యాధులు గుర్తించిన వారికి తదుపరి వైద్య సేవలు అందించడంతో పాటు, అవసరమైన మందులను సకాలంలో సరఫరా చేయాలని తెలిపారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వాణి శ్రీ, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, ఇతర సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


