*వర్షపు నీటితో టీఎల్పేట రోడ్డు జలమయం – బ్రిడ్జి నిర్మాణం వృథా అంటున్న స్థానికులు*
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి మే 05 గుగులోత్ భావుసింగ్ నాయక్
*ఏన్కూరు:*
ఏన్కూరు మండలం టీఎల్పేట గ్రామంలోని అంబేద్కర్ నగర్ వద్ద శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి రహదారిపై భారీగా నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రోడ్డుపై నీరు చేరి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ అధికారులు ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు పంచాయతీ అధికారులు రోడ్డుకు ఇరువైపులా ట్రాక్టర్లను అడ్డంగా నిలిపి వాహనాల రాకపోకలను నియంత్రించేవారని, ప్రజలను అప్రమత్తం చేసేవారని గ్రామస్థులు గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి భద్రతా చర్యలు లేకపోవడంతో ప్రమాదాల ముప్పు పెరిగిందని ఆందోళన చెందుతున్నారు.
రోడ్లపైకి నీరు చేరకుండా ఉండేందుకు బ్రిడ్జి నిర్మించినప్పటికీ వర్షపు నీరు చెరువులా రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బ్రిడ్జి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని, డ్రైనేజీ వ్యవస్థను సరిచేయకుండా నిర్మించిన బ్రిడ్జి వల్ల ఉపయోగం శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే అధికారులు స్పందించి రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. లేకుంటే పెద్ద ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


