పి.గన్నవరం ఆగస్టు 2 (పున్నమి ప్రతినిధి: గెడ్డం ప్రతాప్) : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నియోజకవర్గ ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు సోమవారం సందర్శించి వరద బాధితులను పరామర్శించారు. పడవలో ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగి లంక గ్రామాలు తీవ్రంగా ముంపునకు గురయ్యాయని తెలిపారు. అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు.
వరద ప్రభావిత ప్రతి రేషన్ కార్డుదారుకు రూ.3,000 ఆర్థిక సాయం వెంటనే అందించాలి అని వాటితో పాటు బియ్యం, తాగునీరు, పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులను తక్షణమే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని మీడియా ద్వారా డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలను వేగవంతం చేసి బాధిత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.
వరద పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి బాధిత కుటుంబాలకు తక్షణ ఉపశమనం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ పర్యటనలో పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



