విశాఖపట్నం జిల్లా పున్నమి ప్రతినిధి, ఆగస్టు 20: విశాఖ తీరంలో మత్స్యకారుడు గల్లంతైన ఘటనపై జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించింది. ఆగస్టు 16న విశాఖ నుంచి 8 మంది సిబ్బందితో చేపల వేటకు బయలుదేరిన IND AP V 5 MM 877 బోటు, ఆగస్టు 20న తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో విశాఖ తీరానికి సుమారు 11 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో జాలరిపేటకు చెందిన మత్స్యకారుడు అప్పన్న (45–50) ప్రమాదవశాత్తు సముద్రంలో జారిపడి గల్లంతయ్యారు. సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ స్పందించి సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) ఆపరేషన్‌కు ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాలతో కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఒక బోటు, ఒక ప్రైవేట్ బోటు రంగంలోకి దిగి సముద్రంలో విస్తృతంగా గాలింపు చేపట్టాయి. గల్లంతైన మత్స్యకారుడి ఆచూకీ కోసం అన్ని చర్యలు సమన్వయంతో కొనసాగుతున్నాయి. ఆర్డీవో దిలీప్ చక్రవర్తి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

