రూ.9 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు.. రూ.15 కోట్లతో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులు
మంథని, ఆగస్టు 31:
మంథని పట్టణ అభివృద్ధిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని స్థానిక కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, ప్రధాన రహదారుల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వినాయక టెంపుల్ నుంచి ఎరుకల గూడెం వరకు, వినాయక టెంపుల్ నుంచి తమ్మిచెరువు కట్ట వరకు సీసీ రోడ్ల, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. మంథని పట్టణంలోని వివిధ వార్డుల్లో అంతర్గత సీసీ రోడ్ల అభివృద్ధికి సుమారు రూ.9 కోట్లు కేటాయించి ఆగస్టు 19న పనులకు శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి రోడ్డు నుంచి బస్ డిపో వరకు రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణానికి రూ.15 కోట్లతో పనులు చేపట్టేందుకు చర్యలు ప్రారంభించారు. గాంధీచౌక్–అంబేద్కర్ చౌక్ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, అంబేద్కర్ చౌక్–ముత్యాలమ్మ ఆలయం వరకు రోడ్డు విస్తరణ, క్యాంప్ ఆఫీస్ రోడ్డు అభివృద్ధి పనులకు కూడా నిధులు కేటాయించారు. మంథని నియోజకవర్గంలో గత రెండున్నరేళ్లలో సుమారు రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు ఆగస్టు 19న జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు వెల్లడించారు. ఇటీవల రూ.164 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. మంథని డిపో నుంచి డిగ్రీ కళాశాల వరకు రహదారి అభివృద్ధికి రూ.21 కోట్లు కేటాయించారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.5.25 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ కూడా పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, వినాయక టెంపుల్ నుండి ఎరుకల గూడెం, వినాయక టెంపుల్ నుండి తమ్మిచెరువు కట్ట మార్గాల్లో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పెంటరి రాజు, ఎల్లంకి వంశీ లు సోమవారం పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిని పరిశీలించి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్ తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులు పూర్తయితే పట్టణ రూపురేఖలు మారనున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



