భద్రాచలం / ఖమ్మం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బుధవారం భద్రాచలంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించారని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రికి ఇద్దరు కుడి, ఎడమలా వ్యవహరిస్తున్నారని, మరో మంత్రి అవకాశం దొరికితే ముఖ్యమంత్రి సీటును ఆక్రమించేందుకు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి బలం లేదన్న విమర్శలను ఆయన ఖండించారు. గతంలో ఖమ్మంలో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌కు భారీ సంఖ్యలో యువత తరలివచ్చిందని గుర్తుచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ క్యాడర్ బలంగా ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడమే పార్టీ లక్ష్యమని బండి సంజయ్ స్పష్టం చేశారు.



