ప్రభుత్వ రెవెన్యూ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సిద్ధవటం మండల తహసీల్దార్ విజయ్‌కుమార్ హెచ్చరించారు.మండలంలోని పెద్దపల్లి గ్రామం బొగ్గిడివారిపల్లె పరిధిలోని నిర్మలగిరి కాలనీ సమీపంలో సర్వే నంబర్ 870/3లోని ప్రభుత్వ భూమిని కొందరు జేసీబీ యంత్రాలతో చదును చేసి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు సమాచారం అందడంతో మంగళవారం ఆయన స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కొందరు నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కొంతమంది వద్ద ఉన్న ఇంటి స్థల ధ్రువీకరణ పత్రాల్లో రెవెన్యూ అధికారుల సంతకాలు సైతం నకిలీవిగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. సంబంధిత పత్రాలను సమగ్రంగా పరిశీలించి, భూమి హక్కులపై పూర్తి విచారణ చేపడుతున్నామని చెప్పారు. వివాదాస్పద స్థలాల్లో విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కార్యక్రమంలో మండల సర్వేయర్ జోషి రాజు, వీఆర్వో రేణుక తదితరులు పాల్గొన్నారు.


