సత్తుపల్లి/ఖమ్మం
సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ పాపన్న గౌడ్ ధైర్యసాహసాలు, స్వాభిమానం, సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచిన ప్రజా వీరుడని కొనియాడారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి ప్రజలను సమీకరించి, మొఘల్ సామ్రాజ్య ఆధిపత్యాన్ని సవాలు చేశారని గుర్తుచేశారు. పేదలు, అణగారిన వర్గాలు, వెనుకబడిన ప్రజల హక్కుల కోసం ఆయన పోరాడారని తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.



