తాళ్లపూడి పున్నమి ప్రతినిధి, జూలై 25:
వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకం నూతన అధ్యక్షుడిగా కైగాల శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ పంప్‌హౌస్ ద్వారా 7 నుంచి 8 గ్రామాల రైతులకు సాగునీరు అందుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాల మరమ్మతుల కోసం సీనియర్ నాయకుడు పెండ్యాల అచ్చిబాబు సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి రూ.32 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. త్వరలో నిధులు మంజూరై రైతులకు సకాలంలో సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులు నీటి తీరువా పన్ను చెల్లించి పథకాల నిర్వహణ, అభివృద్ధికి సహకరించాలని కోరారు. నూతన అధ్యక్షుడు కైగాల శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పథకాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. తనపై విశ్వాసం ఉంచిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, పెండ్యాల అచ్చిబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమీప గ్రామాల రైతులు, ఇరిగేషన్ ఈఈ గురవయ్య, కాకర్ల శ్రీనివాస్, టీడీపీ మండల అధ్యక్షుడు సిద్దా దుర్గారావు, బీజేపీ మండల అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ, అన్నమరెడ్డి సత్తిబాబు, గన్నిన సత్తిబాబు, వెంపా నాగేశ్వరరావు, బోడపాటి గంగరాజు, పోతుల దుర్గాప్రసాద్, దేవన సత్యనారాయణ, తైలం బాబ్జి, మద్దుకూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.


