04-09-2026
తిరుమలాయపాలెం
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. సంప్రదాయబద్ధంగా బండ్లు తిప్పిన భక్తులు.. వనభోజనాలతో సందడిగా ముగిసిన వేడుకలు
కాకరవాయి:
కాకరవాయి గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ మహోత్సవాన్ని గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆనాదిగా కొనసాగుతున్న ఆచార, సంప్రదాయాలకు అనుగుణంగా గ్రామ ప్రజలంతా ఐక్యంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మహోత్సవంలో భాగంగా ఆనాటి నుంచి కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం అమ్మవారి దేవాలయం చుట్టూ బండ్లు తిప్పే కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామంలోని ప్రతి కుటుంబం ఉత్సాహంగా పాల్గొనడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. అనంతరం భక్తులకు ఫలహారాలు పంపిణీ చేసి, అందరూ కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు.
అమ్మవారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని భక్తులు ప్రార్థించారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, చిన్నారులు, మహిళలు, యువత, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం గ్రామ ప్రజలంతా సామూహికంగా వనభోజనాలకు వెళ్లి ఆనందంగా గడిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వనభోజనాల్లో పాల్గొని ఆహ్లాదకరంగా గడిపారు.
భక్తి, సంప్రదాయం, గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలిచిన శ్రీ కనకదుర్గమ్మ మహోత్సవం గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపింది. ప్రతి ఏడాది కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.
Uploaded Video:


