ఆత్మకూరు, జూన్ 17 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
రాష్ట్ర ప్రభుత్వం పాలన ప్రారంభించి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 19వ తేదీన ఆత్మకూరులో నిర్వహించనున్న విజయోత్సవ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ మేరకు బుధవారం ఆత్మకూరు పట్టణంలోని సభా వేదిక అయిన శ్రీధర్ గార్డెన్స్ ప్రాంతాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. సభ నిర్వహణకు సంబంధించి వేదిక ఏర్పాట్లు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.మార్కాపురం నుంచి నెల్లూరు వెళ్తున్న క్రమంలో ఆత్మకూరుకు చేరుకున్న మంత్రి సభా ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే విధంగా విజయోత్సవ సభను నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి కూటమి నాయకులందరినీ ఆహ్వానించాలని పార్టీ నేతలకు సూచించారు. అలాగే ప్రభుత్వ పాలనలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను ప్రజలు నేరుగా తెలుసుకునేలా స్టాల్స్ ఉపయోగపడే విధంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో పావని, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్ , మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎం. రాములు, ఆత్మకూరు పట్టణ, రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు.


