📌నాయుడుపేట ఎన్‌హెచ్-71కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలి
📌పుదూరు–అన్నమేడు మధ్య సర్వీస్ రోడ్ల కోసం వినతి: ఎంపీ గురుమూర్తితో కలిసి ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌ను కలిసిన కామిరెడ్డి రాజారెడ్డి
*పున్నమి న్యూస్ దొరవారిసత్రం మద్దాలి వెంకయ్య*05/08/26
తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి-71పై పుదూరు జంక్షన్ నుంచి అన్నమేడు ఆర్‌అండ్‌బీ రోడ్డు జంక్షన్ వరకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌ను కోరారు.
ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎంపీతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, త్రిలోక్ చంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, నాయుడుపేట వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా మారుతోందని, కొత్త కాలనీలు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు పెద్ద సంఖ్యలో ఏర్పడుతున్నాయని తెలిపారు. అయితే యాక్సెస్ కంట్రోల్ విధానంలో నిర్మించిన ఎన్‌హెచ్-71కు సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
సర్వీస్ రోడ్లు లేకపోవడంతో పట్టణం రెండు భాగాలుగా విడిపోయినట్లుగా పరిస్థితి ఏర్పడిందని, స్థానిక రహదారుల మధ్య అనుసంధానం దెబ్బతినడంతో ప్రజలు సమీప ప్రాంతాలకు చేరుకోవడానికి కూడా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. మున్సిపల్ రోడ్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, అంతర్గత వీధులు జాతీయ రహదారితో సమర్థవంతంగా అనుసంధానం కాకపోవడం వల్ల నిత్య రాకపోకలు ఇబ్బందికరంగా మారడంతో పాటు అత్యవసర సేవల రాకపోకలపైనా ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు.
భారతమాల పరియోజన కింద జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ 2019 అక్టోబర్ 30న జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జనావాస ప్రాంతాల్లో అవసరమైన చోట సర్వీస్ రోడ్లు నిర్మించాలని స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని ఎంపీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. పుదూరు జంక్షన్ నుంచి అన్నమేడు జంక్షన్ వరకు ఉన్న ఈ మార్గం పూర్తిగా నాయుడుపేట మున్సిపల్ పరిమితుల్లోనే ఉండటంతో ఈ నిబంధనలు ఇక్కడ వర్తిస్తాయని వివరించారు.
అందువల్ల పుదూరు జంక్షన్ నుంచి అన్నమేడు ఆర్‌అండ్‌బీ జంక్షన్ వరకు ఎన్‌హెచ్-71కు ఇరువైపులా నిరంతర సర్వీస్ రోడ్లు నిర్మించడంతో పాటు వాటిని మున్సిపల్ రోడ్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, అంతర్గత వీధులతో అనుసంధానించేలా తగిన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయాలని ఎంపీ గురుమూర్తి ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌ను విజ్ఞప్తి చేశారు.

