కాపు జేఏసీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి నాగేశ్వరరావు :
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )
యలమంచిలి తూర్పు కాపుల సంక్షేమం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులందరూ కలిసి పనిచేయాలని కాపు జేఏసీ కన్వీనర్ ద్వారపురెడ్డి నాగేశ్వరరావు అన్నారు. ఎలమంచిలిలో గతంలో శంకుస్థాపన చేసి, మధ్యలో నిలిచిపోయిన తూర్పు కాపు కల్యాణ మండపం నిర్మాణాన్ని ప్రజాప్రతినిధులతో మాట్లాడి పూర్తిచేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ఆదివారం ఎలమంచిలి ధర్మవరంలో తూర్పు కాపు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వారపురెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ, తూర్పు కాపుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కల్యాణ మండపం నిర్మాణం పూర్తయితే సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు వివిధ శుభకార్యాల నిర్వహణకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. తూర్పు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో తూర్పు కాపు సమన్వయ కమిటీ అధ్యక్షుడు శెలంశెట్టి సూర్య ప్రకాష్, ఎక్స్ సర్వీస్ మేన్ నక్కా శివ శంకర రావు, యలమంచిలి పట్టణ కాపు సంక్షేమ భరోసా కేంద్రం కన్వీనర్ తేటకల వెంకట సూర్య ప్రకాష్, వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ అడపా శేషగిరి తదితరులు పాల్గొన్నారు.


