Thursday, 24 September 2026

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ..

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : అనకాపల్లి: వినాయక చవితి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని, స్థానిక ఎన్జీవో అసోసియేషన్ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ హితంగా, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ పీలా రవి.మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డి. శేషు కుమార్, కోశాధికారి పల్లా త్రినాథ్, అనకాపల్లి సిటీ అధ్యక్షులు పార్థసారథి, కార్యదర్శి ఎన్. లక్ష్మీనారాయణ, కోశాధికారి ఎస్. ప్రసాద్, మాడుగుల తాలూకా అధ్యక్షులు నాని, ఎన్జీవో అసోసియేషన్ నాయకులు, స్థానిక 83వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొద్ధపు ప్రసాద్, లక్ష్మీదేవిపేట తెలుగుదేశం పార్టీ నాయకులు కొణతాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

బాల్య వివాహాలు, సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు .

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : ​అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పోతిరెడ్డి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఎస్.రాయవరం మండల పరిధిలోని పెద్ద ఉప్పలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నక్కపల్లి సీఐ రామకృష్ణ, ఎస్.రాయవరం ఎస్సై రమేష్ పాల్గొని విద్యార్థులకు పలు చట్టాలు, ప్రస్తుత సామాజిక సమస్యలపై దిశానిర్దేశం చేశారు. బాల్య వివాహాల నిరోధం: బాల్య వివాహాల వల్ల ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలు, బాల్య వివాహ నిషేధ చట్టం–2006 ప్రకారం విధించే కఠిన శిక్షల గురించి అవగాహన కల్పించారు.​ సైబర్ నేరాలు – సోషల్ మీడియా ప్రభావం: ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల వినియోగంపై అప్రమత్తత అవసరమని తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్, మోసపూరిత లింకులు, లోన్ యాప్‌ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు.​ సమాజంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి క్రమశిక్షణ, సత్ప్రవర్తన ఎంతగానో తోడ్పడతాయని, విద్యార్థులు తమ సమయాన్ని చదువు, ఉజ్వల భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.​ఏదైనా సైబర్ మోసం లేదా ఆపద ఎదురైతే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 1930 లేదా 112కు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు

అనకాపల్లి

ప్రజలను మోసం చేసే విధానాలను ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకుల నిరసన.

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : అనకాపల్లి: గత రెండు సంవత్సరాలుగా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం, స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో కొత్త విధానాలు, సామాజిక కార్యక్రమాల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు ఆరోపించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ 82, 83 వార్డు అధ్యక్షులు అల్లా త్రినాథ్, బుద్ధ భాస్కరరావు ఆధ్వర్యంలో ఉడ్పేట సచివాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు, నివాసాలు, నిత్యావసరాలపై సరైన సమాచారం అందించడం లేదని ఆరోపించారు. బాధ్యత కలిగిన ప్రభుత్వ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు కృషి చేస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనకాపల్లి

అనకాపల్లిలో ప్రమాదం: అభయ ఆంజనేయ స్వామి గుడిపై పడిన భారీ వృక్షం..

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ అనకాపల్లి గవరపాలెం పార్కును ఆనుకుని ఉన్న ప్రముఖ అభయ ఆంజనేయ స్వామి ఆలయంపై ఒక భారీ వృక్షం కూలిపడింది. ఈ ప్రమాదంలో ఆలయ పైభాగం పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. వృక్షం ఒక్కసారిగా విరిగిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో ఆలయ పరిసరాల్లో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. ప్రహరీ గోడ, ఆలయ కట్టడం కొంతమేర దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో పాత, బలహీన వృక్షాలను గుర్తించి తొలగించాలని స్థానిక భక్తులు, ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఆలయ పునరుద్ధరణ చర్యలు త్వరితగతిన చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో భారీ వృక్షాల భద్రతపై స్థానిక అధికారులు సర్వే నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

అనకాపల్లి

దశాబ్దాలుగా హామీలే… రోడ్డు మాత్రం అధ్వానమే!

పెనుగోలు–ధర్మవరం నుంచి ఎస్‌.రాయవరం వరకు రహదారి విస్తరణకు ఎదురుచూపులు అనకాపల్లి జిల్లా సెప్టెంబర్ 12 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ) ఎస్‌.రాయవరం: వరహానది సమీపంలోని ఎన్‌హెచ్‌-5ను ఆనుకుని పెనుగోలు–ధర్మవరం నుంచి ఎస్‌.రాయవరం వైపు వెళ్లే సుమారు మూడు కిలోమీటర్ల రహదారి ఆర్‌అండ్‌బీ శాఖకు సవాల్‌గా మారింది. దశాబ్దాలుగా నాయకులు రోడ్డు విస్తరణపై హామీలు ఇస్తూ ప్రజల్లో ఆశలు రేకెత్తించడం, అనంతరం వాటిని మరిచిపోవడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్ర హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ రహదారి పరిస్థితి ఇలా ఉండటం గమనార్హం. మండల కేంద్రంగా ఉన్న ఎస్‌.రాయవరానికి సుమారు 28 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఎండీఎఫ్‌ఓ, తహసీల్దార్‌, పీడబ్ల్యూడీ తదితర కార్యాలయాలకు వెళ్లే ప్రజలు ఈ సింగిల్‌ రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకటి పడితే రహదారి ఎక్కడ ముగుస్తుందో, వాహనం ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదని ప్రజలు వాపోతున్నారు. మత్స్యకారులు, కొబ్బరి వ్యాపారులు అధికంగా వినియోగించే ఈ రహదారిని తక్షణమే విస్తరించి, ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అనకాపల్లి

గణపతి మట్టి విగ్రహాల విశిష్టత విద్యార్థులకు అవగాహన..

యలమంచిలి :పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ఎపిఎన్ జిసి, అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు యలమంచిలి పట్టణంలోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మట్టి గణపతి విగ్రహాల తయారీ, వాటి విశిష్టతపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ​పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.వి. రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే ముప్పును ఉపాధ్యాయులు వివరించారు. రసాయన రంగుల వల్ల భూమి, జలాలు ఏ విధంగా కలుషితమవుతాయో విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు స్వయంగా తయారు చేసిన మట్టి గణపతి ప్రతిమలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు తాము తయారు చేసిన మట్టి ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేస్తూ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను విడిచిపెట్టి పర్యావరణహిత మట్టి వినాయకులను పూజించాలని తల్లిదండ్రులకు, స్థానికులకు అవగాహన కల్పించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మంగపతి, కుందూరు రాజు, కిషోర్ కుమార్, రాజేశ్వరి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్‌..

​ఈ నెల 12వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ పిలుపునిచ్చారు. పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రాజీపడదగ్గ కేసులను స్నేహపూర్వక వాతావరణంలో, శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు. పరిష్కరించుకోగల ప్రధాన కేసులు: రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు: చిన్నపాటి ఘర్షణలు, పరస్పర ఫిర్యాదులు, సెక్షన్ 320 సీఆర్‌పీసీ పరిధిలోని వివాదాలు. ట్రాఫిక్ చలాన్లు: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్లు, వాహన తనిఖీ కేసులు. సివిల్ & భూవివాదాలు: సరిహద్దు తగాదాలు, ఆస్తి విభజన సమస్యలు, ఒప్పంద ఉల్లంఘనలు. కుటుంబ వివాదాలు & చెక్ బౌన్స్ కేసులు: భార్యాభర్తల మధ్య విభేదాలు, మెయింటెనెన్స్ పిటిషన్లు మరియు ఎన్.ఐ. యాక్ట్ సెక్షన్ 138 కింద నమోదైన కేసులు. ​ లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలు: సమయం, ధనం ఆదా: కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ తప్పి, సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు ముగింపు పడుతుంది. ఇరుపక్షాలకూ గెలుపు: పరస్పర అంగీకారంతో పరిష్కారం లభిస్తుంది కాబట్టి ఎవరికీ ఓటమి ఉండదు; శత్రుత్వం తొలగి సత్సంబంధాలు కొనసాగుతాయి. శాశ్వత పరిష్కారం: లోక్ అదాలత్‌లో ఇచ్చే తీర్పుపై మళ్లీ అప్పీలు ఉండదు; ఇది సివిల్ కోర్టు డిక్రీతో సమానం. ​తమ కేసులను పరిష్కరించుకోవాలనుకునే కక్షిదారులు తక్షణమే సమీప పోలీస్ స్టేషన్‌ను గానీ, న్యాయవాదులను గానీ లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) కార్యాలయాన్ని గానీ సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ఎస్పీ సూచించారు. వివాద రహిత, ప్రశాంతమైన సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

అనకాపల్లి

బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిఐటియు మద్దతు..

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : యలమంచిలి/అచ్చుతాపురం/బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై, చేసిన ఒప్పందాలను ఆమోదించాలని కోరుతూ సెప్టెంబర్ 11న జరిగే బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని బ్యాంక్ ఉద్యోగుల సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొని డిమాండ్లు పరిష్కారానికై తమ వంతు కృషి చేస్తుందని సిఐటియు తెలియజేశారు. అనకాపల్లిలో ఉన్న అన్ని బ్యాంకులలో ఈరోజు ఉదయం నుంచి ఉద్యోగులకు సమ్మెకు సంబంధించిన కరపత్రాన్ని పంపిణీ చేసి తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకు యూనియన్లు ఇచ్చిన పిలుపు లో భాగంగా యూనియన్స్తో వారంలో ఐదు రోజులు బ్యాంకింగ్ కోసం జరిగిన ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా తొక్కు పెట్టిందన్నారు. కుదిరిన ఒప్పందం ప్రకారం మొత్తం బ్యాంకులవారీగా సాధించిన ఫలితాలను బట్టి ఆ బ్యాంకుల్లో కింది నుంచి పైదాకా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం మరిన్ని బ్యాంకులను విలీనం చేసి ప్రైవేటీకరణ చర్యలతో పాటు, కార్పొరేట్ అధినేతలు బ్యాంకులకు బకాయిలను ఎగ్గొట్టటం కోసం కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పుకొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ విధానాల పట్ల బ్యాంకు ఉద్యోగులు ఇతర కార్మికులు ఐక్యంగా పోరాటం చేసి తిప్పుకొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని అన్నారు దీంట్లో భాగంగా సెప్టెంబర్ 11 జరిగే సమ్మెలో సిఐటియు ప్రత్యక్షంగా పాల్గొని డిమాండ్లు పరిష్కారాన్ని కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అచ్చుతాపురం మండల కన్వీనర్ కూండ్రపు సోము నాయుడు బ్యాంకు ఉద్యోగులు గోవిందు, జగదీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం ..

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. వెంకట నారాయణ స్పూర్తి జూనియర్ కళాశాల విద్యార్థులతో పాటు నూకాలమ్మ ఆర్చ్ వద్ద వాహనదారులకు పలు సూచనలు చేశారు.హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు, సిగ్నల్స్‌ను పాటించకపోవడం, అతివేగంగా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. నూకాలమ్మ ఆర్చ్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేసినందున వాహనదారులు తప్పనిసరిగా సిగ్నల్ నిబంధనలు పాటించాలని సూచించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ఇన్‌స్పెక్టర్ ఎం. వెంకట నారాయణ తెలిపారు.

అనకాపల్లి

పర్యావరణ పరిరక్షణకు హరిత వినాయకుడే మార్గం..

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : ఎరుకువానిపాలెం పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ అనకాపల్లి మండలం:ఎరుకువానిపాలెం, వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, ఎరుకువానిపాలెంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ గారు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య పరిరక్షణ పురస్కార గ్రహీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “శ్రీ వినాయకుడిని భక్తితో పూజించడం మన సంప్రదాయం. అదే సమయంలో ఆయనకు ప్రీతిపాత్రమైన ప్రకృతిని కాపాడటం కూడా మన పవిత్రమైన బాధ్యత” అని అన్నారు. “పండుగ మనకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ ప్రకృతికి నష్టాన్ని కలిగించకూడదు. మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించడం ద్వారా మన సంప్రదాయాన్ని గౌరవించడంతో పాటు జలవనరులను కాలుష్యం నుంచి కాపాడవచ్చు” అని తెలిపారు. విద్యార్థులు తమ ఇళ్లలో మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పాటు, కుటుంబ సభ్యులు మరియు చుట్టుపక్కల ప్రజలకు కూడా పర్యావరణహిత వినాయక చవితి ప్రాముఖ్యతను తెలియజేయాలని పిలుపునిచ్చారు. “ఒక ఇంట్లో మట్టి వినాయకుడు ప్రతిష్ఠించడం ఒక చిన్న అడుగు కావచ్చు… కానీ అలాంటి లక్షల చిన్న అడుగులే పర్యావరణ పరిరక్షణలో గొప్ప మార్పును తీసుకువస్తాయి” అని ప్రధానోపాధ్యాయులు అన్నారు.పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ అరిగే శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, చిన్న వయసులోనే విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలను పర్యావరణ పరిరక్షకులుగా తీర్చిదిద్దవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీ కె. నరసింహమూర్తి గారు, శ్రీ బి. వై. వై. ఎస్. కృష్ణారావు గారు, శ్రీమతి పి. జయశ్రీ గారు, శ్రీమతి డి. శ్రీలత గారు, శ్రీమతి ఎస్. సుజాత గారు,శ్రీమతి ఉమా గారు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. “శ్రీ వినాయకుడిని ఆహ్వానిద్దాం – ప్రకృతిని పరిరక్షిద్దాం;మట్టి వినాయకుడిని పూజిద్దాం – జలవనరులను కాపాడుదాం;భక్తిని చాటుదాం – బాధ్యతను నిర్వర్తిద్దాం.”“ఈ వినాయక చవితి… మన భక్తికి మాత్రమే కాదు,మన ప్రకృతి పరిరక్షణకు కూడా పండుగ కావాలి.”అని నినాదాలు అందరినీ జాగృతి పరచడమైనది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.