Monday, 21 September 2026

Tag: Mumcipility

నంద్యాల

రాయలసీమ నీటి హక్కులపై మౌనం ఎందుకు?: బొజ్జా దశరథరామిరెడ్డి ప్రశ్నాస్త్రం

నంద్యాల : శ్రీశైలం జలాశయంలో క్యారీ ఓవర్ నీటిని నిల్వ చేయకుండా కేవలం 39.26 టీఎంసీలకే పరిమితం చేయడంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది సమృద్ధిగా కృష్ణా జలాలు వచ్చినప్పటికీ నిల్వ చేయకపోవడం వల్ల ప్రస్తుతం రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు.విద్యుత్ ఉత్పత్తి నెపంతో శ్రీశైలం నీటిని నాగార్జున సాగర్‌కు తరలిస్తూ, రాయలసీమ ఆయకట్టుకు నీరు ఇవ్వకపోవడం సరికాదని, నీరు రాయలసీమ ప్రజల హక్కు అని తేల్చి చెప్పారు. ఎల్‌నినోను సాకుగా చూపకుండా జలాశయ విధివిధానాలను అమలు చేసి, సీమలోని ప్రాజెక్టులు, ఆయకట్టు, చెరువులు, కుంటలకు వెంటనే నీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నంద్యాల

ధరల పెంపుపై సీపీఎం వినూత్న నిరసన: కూటమికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిక!

నంద్యాల: పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం పట్టణ కార్యదర్శి దర్శనం లక్ష్మణ్ విమర్శించారు. నిత్యావసరాల ధరల పెంపునకు నిరసనగా సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక గాంధీ చౌక్ సెంటర్‌లో వినూత్న నిరసన చేపట్టారు. నాయకులు మెడలో ఉల్లిగడ్డలు, మిరపకాయల దండలు వేసుకుని, నిత్యావసర సరుకులను ముందర ఉంచి నిరసన తెలిపాయి. కందిపప్పు, నూనె, ఉల్లి, చక్కెర, బియ్యం ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని, ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పుల్లా నరసింహ, మహ్మద్ గౌస్, వెంకటలింగం, మౌలాలి, తోట మద్దులు తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు: మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక

నంద్యాల పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీ పరిధిలోని ఐయూడీపీ పథకం (IDSMT) కింద కేటాయించిన భూములను ఆక్రమించినా, అనధికారికంగా బోర్డులు ఏర్పాటు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల పురపాలక సంఘం కమిషనర్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.గతంలో భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకున్న 94.24 ఎకరాల భూమిని మున్సిపాలిటీకి కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న నంద్యాల విలేజ్ సర్వే నంబర్లు 2311, 2312, 2313, 2314, 2318/A&C, నూనెపల్లె విలేజ్ సర్వే నంబర్లు 410, 411, 412/2 భూములను సెక్షన్ 22-ఎ కింద నిషిద్ధ ఆస్తుల జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు. ఈ భూములపై న్యాయస్థానంలో కేసులు పెండింగ్‌లో ఉన్నందున, ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని కమిషనర్ స్పష్టం చేశారు.

నంద్యాల

రైతును మోసగించిన వీఆర్వో అబ్దుల్లా పై కలెక్టర్‌తో విచారణ జరిపించాలి

వెలుగోడు :పొలం పేరుతో పేద రైతును మోసగించిన వీఆర్వో అబ్దుల్లాపై కలెక్టర్ నేతృత్వంలో విచారణ కమిటీ వేసి కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వెలుగోడు తహశీల్దార్ శ్రీనివాసులు గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకుడు పి. లాజరస్, రైతు కూలీ సంఘం మండల అధ్యక్షుడు చాంద్ బాషా మాట్లాడుతూ.. బాధితుడు షేక్ హుస్సేన్ మియా దంపతుల వద్ద వీఆర్వో అబ్దుల్లా ఆయన సోదరులు పొలం అమ్మకం కోసం ₹7.30 లక్షలు తీసుకుని అగ్రిమెంట్ చేశారన్నారు. 2024 జూన్ 3న ఆన్‌లైన్‌లో ఎక్కించిన పేరును ఆ తర్వాత తొలగించి, వీఆర్వో తన బంధువుల పేర్లను చేర్చి రైతును మోసం చేశారని మండిపడ్డారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు రవి, బాధితుడు హుస్సేన్ మియా దంపతులు పాల్గొన్నారు.

నంద్యాల

శ్రీశైలం నీటి తరలింపును ఆపాలి: బొజ్జా దశరథరామిరెడ్డి

నంద్యాల :శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి తరలింపును వెంటనే నిలిపివేసి, రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలకు నీటిని భద్రపరచాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.ఇప్పటికే శ్రీశైలం నుంచి 53 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌కు తరలించడం రాయలసీమ నీటి భద్రతకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల సమస్యపై కేఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ పరిధిలో పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సమితి నాయకులు ఏరువ రామచంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, నిట్టూరు సుధాకర్‌రావు పాల్గొన్నారు.

నంద్యాల

ముస్లింల హామీలు అమలు చేయాలి: ఇన్సాఫ్‌

నంద్యాల :గత ఎన్నికల సమయంలో ముస్లింలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆల్‌ ఇండియా తంజీమ్‌-యే-ఇన్సాఫ్‌ జిల్లా సమితి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారి రామ్‌నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఇన్సాఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. రియాజ్ మాట్లాడుతూ.. 50 శాతం రాయితీతో మైనార్టీ రుణాలు, దుల్హన్‌ పథకానికి ₹1 లక్ష, నిరుద్యోగులకు ₹3 వేల భృతి, మహిళలకు ₹1,500 సాయం అందించాలని కోరారు. ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఇమామ్‌లు, మౌజన్‌లకు సకాలంలో గౌరవ వేతనాలు ఇవ్వాలని, ఆక్రమణకు గురైన వక్ఫ్‌ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు బాబా ఫక్రుద్దీన్‌, బాదుల్లా, కలాం, మహమ్మద్‌ అలీ పాల్గొన్నారు

నంద్యాల

త్వరలోనే టిడ్కో ఇళ్ల పంపిణీ: మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్

నంద్యాల:నంద్యాల పట్టణంలోని ఎస్‌ఆర్‌బీసీ కాలనీలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ జరుగుతున్న తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మిగిలి ఉన్న పనులను నాణ్యతతో, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అన్ని వసతులతో త్వరలోనే ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, టిడిపి నాయకులు ఎన్.ఎం.డి. ఫయాజ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

నంద్యాల

పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ: ఎన్నికల పరిశీలకురాలు పి. ప్రశాంతి

నంద్యాల:ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్నికల పరిశీలకురాలు పి. ప్రశాంతి మంగళవారం నంద్యాల నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఆర్టీసీ బస్టాండ్ సమీప పోలింగ్ కేంద్రం, ఎస్పీజీ మిషన్ ప్రాంగణం, ఎస్పీజీ ఉన్నత పాఠశాలలోని కేంద్రాలను ఆమె సందర్శించారు.ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ పురోగతి, అందిన దరఖాస్తులు, అభ్యంతరాలు మరియు బిఎల్‌ఓలు (BLO) నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేశారు. సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న, ఈఆర్‌వో శివప్రసాద్ రెడ్డి, నంద్యాల అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులు మరియు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.ఓటరు నమోదు, జాబితాలో వివరాల సరిచూపు లేదా సవరణలకు సంబంధించిన మరిన్ని వివరాలు మరియు సేవలకు భారత ఎన్నికల సంఘం ECI Official Website లేదా ఓటర్ల సేవా పోర్టల్ Voters’ Service Portal ను సందర్శించగలరు.

నంద్యాల

8వ వార్డు సచివాలయంలో అసిస్టెంట్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

నంద్యాల:నంద్యాల పట్టణంలోని 8వ వార్డు సచివాలయాన్ని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె. కళ్యాణి బాయి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా సచివాలయ సిబ్బంది హాజరు రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ మరియు ప్రజలకు అందుతున్న వివిధ రకాల సేవల పురోగతిని ఆమె సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ… సచివాలయానికి ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు, వినతులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా సచివాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీతో సచివాలయ సిబ్బందిలో అప్రమత్తత పెరిగింది.

నంద్యాల

ఉపాధి హామీ, పేదల సమస్యలపై తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

నంద్యాల:పేదలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. బాబా ఫకృద్దీన్ మాట్లాడుతూ. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, పెండింగ్‌లో ఉన్న కూలి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయడంతో పాటు అటవీ హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటీయూసీ, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.