Thursday, 24 September 2026

Tag: Manthani

పెద్దపల్లి

గంగాపురి: మల్లెపూల హనుమాన్ ఆలయం నూతన కార్యవర్గం ఎన్నిక

మంథని, ఆగస్టు 16: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురిలోని మల్లెపూల హనుమాన్ దేవాలయ నూతన అధ్యక్షుడిగా శనివారం బత్తుల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా గోరంట్ల సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా పుల్లే రవీందర్, కోశాధికారిగా పుల్లె రాధాకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా బండి రవి లను ఎన్నుకున్నారు. ఈ కమిటీ రెండు సంవత్సరాల కాలపరిమితి 14 ఆగస్టు 2025 నుండి 14 ఆగస్టు 2027 వరకు కొనసాగుతుందని, ఈ కమిటీకి పద్మశాలి కులస్తులందరూ సహకరించినందుకు పద్మశాలి సంఘంకు నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గంగాపురి మల్లెపూల హనుమాన్ దేవాలయ నూతన కమిటీ అధ్యక్షులు బత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ.. తమకు ఈ ఆలయ బాధ్యతలు నమ్మకంతో అప్పగించినందుకు, తమ బాధ్యతను శిరసా వహిస్తూ, అందరి నమ్మకాన్ని వమ్ము చేయమని, తమ కార్యవర్గం దేవాలయ అభివృద్ధి కోసం పాటు పడతామని నూతన దేవాలయ కార్యవర్గం తెలియజేశారు.

పెద్దపల్లి

ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా నగదు పంపిణీ చేయాలి

*ఈ ఏడాదైనా నాణ్యమైన చేప పిల్లలను సరైన సమయంలో అందించాలి* *రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ కు పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ల వినతి పత్రం* *_మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్_* మంథని/ హైదరాబాద్, ఆగస్టు 01, పున్నమి ప్రతినిధి: ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో నాసిరకం చేప పిల్లలను ఆలస్యంగా అందడం వలన, చేపలు పెరగక మత్స్య కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్ర ఫిషరీస్ కార్యాలయంలో ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ను శుక్రవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్లు కలిశారు. ఈ క్రమంలో ఆయనకు మత్స్య కార్మికుల పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో గత ఏడాది నాసిరకం చేప పిల్లలను చాలా ఆలస్యంగా ఇవ్వడంతో, రాష్ట్ర వ్యాప్తంగా వాటిని తిరిగి వెనక్కి పంపడం జరిగిందనీ గుర్తు చేశారు. ఈ ఏడాదైనా నాణ్యమైన పెద్ద చేప పిల్లలను, సరైన సమయంలో అందించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులుగా, నగదు పంపిణీ కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పథకాలు పెట్టీ మత్స్యకారులకు తోడుగా ఉండాలని వారు కోరారు. సమస్యల పైన రాష్ట్ర ఫిషరీస్ ఛైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ గత యేడాది జరిగిన తప్పులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకొని మత్స్య కార్మికులకు కొత్త పథకాలు పెట్టీ ప్రోత్స్యహిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా డైరెక్టర్స్ పోతరవేని క్రాంతి కుమార్, అయిలావేని వీరాస్వామి, పెద్దపల్లి సుజాత పోచయ్య, చిట్ల శ్రీనివాస్, తాళ్ళ తిరుపతి, రేళ్ళ కోటయ్య, బోయిరి శ్రీకాంత్, పొలవేని మొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ పిట్టల రవి కుమార్, పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

*కార్మికుల హక్కుల కోసం రాజీ లేని పోరాటాలు నిర్వహించాలి*

*ఘనంగా మంథని మున్సిపాలిటీ నాలుగవ మహాసభలు* *కార్మికుల హక్కుల కోసం రాజిలేని పోరాటాలు నిర్వహించాలి* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఫ్రెండ్స్ క్లబ్ లో మంథని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ నాలుగవ మహాసభ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సీనియర్ మున్సిపల్ కార్మికుడు వడ్లకొండ రాజయ్య జండా ఆవిష్కరణ చేశారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ మంథని మున్సిపాలిటీ కార్మికులు స్థానికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించుకున్నారని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. అదే పోరాట స్ఫూర్తితో రానున్న కాలంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై రాజీ లేని పోరాటాలు నిర్వహించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రావణపల్లి వెంకటస్వామి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ పాల్గొనగా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మంథని లింగయ్య సహార్థ సందేశం ఇవ్వగా, మున్సిపల్ కార్మికులు గడిపెళ్లి మల్లేష్, చిప్పకుర్తి చందు, సింగారపు గట్టయ్య, భాగ్య, పోచమ్మ, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి విద్య విజ్ఞానం

మంథని గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కు దరఖాస్తుల ఆహ్వానం

*మంథని గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కు దరఖాస్తుల ఆహ్వానం* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్ మీడియట్ 2025 – 2026 మొదటి విద్యా సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో మిగిలిన ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ నెల 31 తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉటూరి శ్రీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంథని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇదివరకే దరఖాస్తు సమర్పించిన విద్యార్థులు కూడా ఈ స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చునని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. విద్యార్థులు తమ అన్ని అర్హతలను తెలియజేసే సర్టిఫికెట్లతో ఈ నెల 31 తేదీన ఉదయం 9 గంటలకు తమకు అడ్మిషన్ కావాల్సిన గురుకుల జూనియర్ కళాశాలలో హాజరుకావాలని ఆయన వివరించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యార్థుల దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత, మెరిట్ లిస్టు ప్రకటించి, వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి, సీట్లు కేటాయిస్తారని తెలిపారు. అడ్మిషన్లన్నీ రిజర్వేషన్ ప్రకారం, పదవ తరగతిలో వచ్చిన మార్కుల ప్రాతిపదికన కేటాయించబడతాయన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల అర్హతలను వివరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2025 సంవత్సరంలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షలలో ఒకే ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలనీ, విద్యార్థులు తమ స్వంత జిల్లా/ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలనీ, పదవ తరగతి తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, పదవ తరగతి మార్కుల మెమో, అవసరమైన సర్టిఫికెట్ లన్ని కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకొనే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో సంవత్సరానికి రూ. 2,00,000, గ్రామీణ ప్రాంతంలో రూ. 1,50,000 మించకూడదనీ, ఇందుకు సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని 2025 జనవరి 1 వ తేదీన లేదా అంతకుముందు తేదీలో తహశీల్దార్ జారీ చేయాలనీ, విద్యార్థుల వయస్సు 2025 ఆగస్టు 31 తేదీ నాటికి 17 సంవత్సరాలు మించకూడదనీ, ఈ విషయంలో ఎస్సీ విద్యార్థులందరికీ ఒక సంవత్సరం సడలింపు ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు.

తెలంగాణ పెద్దపల్లి

మంథని మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

*మంథని మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంథని, జులై 29, పున్నమి ప్రతినిధి: బయోమెట్రిక్ విధానం ద్వారా వైద్య సిబ్బంది హాజరు నమోదు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంథని మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు మంథని పట్టణ కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాత శిశు ఆసుపత్రి, గోపాల్పూర్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గద్దలపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో వార్డులను క్షుణ్ణంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగుల కొరకు నూతనంగా నిర్మించిన షెడ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో సిబ్బంది, వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని, ప్రతిరోజు తప్పనిసరిగా వివరాలను బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. మాత శిశు ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను గర్భిణీ మహిళలకు అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గోపాల్పూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు. గద్దెలపల్లి ప్రాథమిక ఆసుపత్రిని పరిశీలించి ఏఎంసీ ప్రొఫైల్ సక్రమంగా నిర్వహించాలని, ఎన్సీడీ స్క్రీనింగ్, ఎక్స్రే, టీబీ, ముక్తు భారత్, ఆరోగ్య మహిళా తదితర వాటిపై ఆరా తీశారు. ఓ పీ సేవలు పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఎంపీడీవో శశికళ, మంథని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, ఏఈపిఆర్ అనుదీప్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ బృందం

*మంత్రి శ్రీధర్ బాబును కలిసిన మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ బృందం* మంథని/హైదరాబాద్, జులై 27, పున్నమి ప్రతినిధి: మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా కుడుదుల వెంకన్న, వైస్ చైర్మన్, డైరెక్టర్లు శనివారం హైదరాబాద్ లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మంథని మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు అభినందనలు తెలియజేశారు. ఇదే క్రమంలో మంత్రి మాట్లాడుతూ చైర్మన్, డైరెక్టర్లు అందరూ కలిసి రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని తెలిపారు. రైతులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, రైతుల కష్టాలను తీర్చడానికి వారి వెన్నంటే ఉండాలని, వారికి అన్ని విధాలుగా సహాయం చేయాలని అన్నారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో మంథని మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, వివిధ మండలాల చైర్మన్స్, డైరెక్టర్స్ పాల్గొనడం జరిగింది.

తెలంగాణ పెద్దపల్లి హైదరాబాద్

జూనియర్ సివిల్ జడ్జిని సన్మానించిన ఇనుముల..!!

*జూనియర్ సివిల్ జడ్జిని సన్మానించిన ఇనుముల…!!* మంథని/హైదరాబాద్, జులై 27, పున్నమి ప్రతినిధి: ఉస్మానియా యూనివర్సిటీలోని న్యాయ కళాశాలలో ఎల్ ఎల్ ఎం ప్రథమ సంవత్సరం చదువుతూ, ఇటీవల ప్రకటించిన జ్యుడిషియరీ నియామక ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జి ( జే సీ జే ) గా ఎన్నికయిన సహచర విద్యార్థిని ధరావత్ సుష్మ ను తమ బ్యాచ్మెట్, పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది, లాయర్స్ ఇండియా ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇనుముల సత్యనారాయణ (సతీష్ ) అభినందనలు తెలిపి శాలువాతో సత్కరించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో తమతో పాటు పీజీ చేస్తున్న సుష్మ జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్ లో జ్యుడిషియర్ విభాగంలో మరింత ఎత్తుకు ఎదుగాలని పలువురు ఆకాంక్షించారు. అదేవిధంగా పదవ తరగతి వరకు సూర్యాపేట జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో చదివి, ఆ తర్వాత హైదరాబాద్ లోని పెండెకంటి న్యాయ కళాశాలలో ఎల్ ఎల్. బి పూర్తి చేసి, గ్రామీణ నేపథ్యం న్యాయ శాస్త్ర ప్రతిభకు అడ్డురాదనీ నిరూపించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయిన సుష్మ ను సహచర విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయశాస్త్ర పీజీ విద్యార్థి ఇనుముల సత్యనారాయణ తో పాటు సహచర పీజీ విద్యార్థులు నరేష్ రాథోడ్, ప్రభావతి, నవీన్ కుమార్, ఆనంద్, వేణుగోపాల్, సువర్ణ, శరత్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

రేపటి రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపు

రేపటి రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పిలుపు మంథని, జులై 22, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జూలై 23న నిర్వహించే రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయడానికి విద్యార్థి లోకమంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ, డీఈవో పోస్టులను భర్తీ చేయాలని,బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని,అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి.ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని, విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ లతో ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యా రంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు బందెల రాజకుమార్, నాయకులు రజినీకాంత్, గణేష్, రోహిత్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు..

తెలంగాణ రంగారెడ్డి హైదరాబాద్

రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

రోడ్ల నిర్మాణాలకు అటవీ భూమి సేకరణ పనులు పూర్తిచేయాలి- మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, జులై 18, పున్నమి ప్రతినిధి : బాచుపల్లి – గండి మైసమ్మ వరకు 6 వరసల రోడ్డు, బహుదూర్ పల్లి నుంచి దూలపల్లి మీదుగా కొంపల్లి వరకు సాగే రహదారి నిర్మాణాలకు అటవీ భూమి బదలాయింపు పై రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ సువర్ణ, హెచ్ ఎండీఎ కమిషనర్ సర్ఫరాజ్ నవాజ్, జిహెచ్ ఎంసీ అదనపు కమిషనర్, కొంపల్లి మున్సిపల్ కమిషనర్, మేడ్చెల్స్ అదనపు కలెక్టర్, తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూమి, ఫారెస్టేతర స్థలాల భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పనులకు శంకుస్థాపన జరిగే విధంగా యుద్ధ ప్రాతిపదికన నిర్దేశించిన పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. అటవీ శాఖకు చెందిన 19 ఎకరాల భూమి అప్పగింతకు సంబంధించి మొదటి దశ ఫార్మాటిలిటీలన్నీ గడువులోగా అయ్యేలా చూడాలని ఆదేశించారు. స్థానికులకు చెందిన భూముల సేకరణ, నష్టపరిహారం చెల్లింపులో మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు. భూసేకరణకు పరిహారంగా ఇచ్చే నిధులను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే 8 శాసన నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి అన్నారు. బహదూర్ పల్లి నుంచి కొంపల్లి రోడ్డులో అటవీ భూమి బదలాయింపునకు సంబంధించి స్టేజ్-1 ప్రక్రియ పూర్తయిందని ఫారెస్ట్ అధికారులు శ్రీధర్ బాబుకు వివరించారు. బాచుపల్లి – గండి మైసమ్మ రోడ్డు నిర్మాణానికి అవసరమైన అటవీభూమి ట్రాన్సఫర్ పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. సుభాష్ నగర్ పైపు లైన్, సెయింట్ యాన్స్ స్కూల్ రోడ్డు నిర్మాణం పనులను కూడా పూర్తి చేయాలని రెవిన్యూ, మున్సిపల్ అధికారులను శ్రీధర్ బాబు ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పోస్టులు మoజూరు చేయండి

ముధోల్, జులై 16(తెలంగాణ పున్నమి ప్రతినిధి ):మండల కేంద్రమైన ముధోల్లో ప్రారంభం అయినా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2024 సంవత్సరంలో 54 విద్యార్థులు అడ్మిషన్స్ పొందారు. 8మంది అతిథి అధ్యాపకుల నియామకం జరిగింది. ఈ సంవత్సరo కుడా అధ్యాపకుల సహకారంతో ఫేస్ 3 వరకు 86 మంది విద్యార్థులు అడ్మిషన్స్ పొందారు. కానీ ఇప్పట్టి వరకు అధ్యాపకులకు పర్మిషన్ ఇవ్వలేదు. అడ్మిషన్స్ షెడ్యూల్ ప్రకారం క్లాస్ లు ప్రారంభమయ్యాయి. అధ్యాపకుల నియామకంలో ఆలస్యం వలన విద్యార్థులు నష్టపోతున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవోలో ముధోల్ డిగ్రీ కళాశాల కు పోస్ట్ లు మంజూరు చేయలేదు. దీని వలన ఇక్కడ ఉన్న అధ్యాపకులకు విద్యార్థులకు నష్టం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కమీషనర్ వెంటనే స్పందించి ముధోల్ కళాశాలకు పోస్ట్ లు-నిధులు విడుదల చేయాలని ముధోల్ వీడీసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి ముధోల్ఎమ్మెల్యే రామారావు పటేల్ కి స్థానిక నాయకులు ఫోన్ చేసి వివరించారు. ఎమ్మెల్యే కూడా ఈ విషయం పై ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్య పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.