Thursday, 1 October 2026

Tag: Award

నంద్యాల

విద్యార్థుల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమం

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల అధ్యక్షులు సందీప్ ఆధ్వర్యంలో గుండె ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ మురళి, పీడియాట్రీషియన్ డాక్టర్ కార్తికేయలు విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను వివరించి, వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమానికి సహకరించిన పాఠశాల ఛైర్మన్ పి. దస్తగిరి రెడ్డి, డైరెక్టర్ షావల్ రెడ్డిలకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు చంద్రశేఖర్, సురేష్, నాగరాజు, కిరణ్ లాల్ పాల్గొన్నారు.

నంద్యాల

విజయవంతంగా ముగిసిన 9వ జాతీయ స్థాయి నంది నృత్య పోటీలు

నంద్యాల: స్థానిక శ్రీ వివేకానంద ఆడిటోరియంలో ‘శ్రీ సాయి నాట్యాంజలి ఫైన్ ఆర్ట్స్ డెవలప్‌మెంట్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ జాతీయ స్థాయి నంది నృత్య పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ కూచిపూడి నాట్యగురువు డా. వేదాంతం రాధేశ్యామ్ న్యాయనిర్ణేతగా, శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డా. జి. రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కూచిపూడి, భరతనాట్యం, జానపద విభాగాల్లో వివిధ నాట్యగురువుల శిష్యులు ప్రతిభ చాటగా.. విజేతలకు ‘నంది’ మెమోంటోలతో సన్మానించినట్లు సంస్థ నిర్వాహకులు డా. పల్లెంశెట్టి సురేష్ తెలిపారు.

నంద్యాల

నవజీవన్ బధిరుల పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ బధిరుల వారోత్సవాలు

ఆయ్యలూరు మెట్ట: నంద్యాల ఆయ్యలూరు మెట్టలోని నవజీవన్ బధిరుల ప్రత్యేక పాఠశాలలో అంతర్జాతీయ బధిరుల వారోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ జాన్ మేరీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బధిర విద్యార్థులు వైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో చదువు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నెలకు ₹6,000 పెన్షన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తోందని, స్వచ్ఛంద సంస్థల సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఉపాధ్యాయుల సంకేతాలకు అనుగుణంగా బధిర బాలలు చేసిన సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ, రాజశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నంద్యాల

నవంబర్ 1న ఉచిత ముస్లిం సామూహిక వివాహాలు: వధువుకు ₹50,000 బహుమతి – నశ్యం అబ్దుల్ ఖుద్దూస్

నంద్యాల అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 1న పేద ముస్లిం యువతులకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. అర్హులైన వధువరులు తమ ఆధార్, ఫోటోలు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లతో అక్టోబర్ 25 లోపు అంజుమన్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివాహం రోజు నిఖా ఖర్చులు భరించడంతో పాటు వధువుకు ₹50,000 నగదు చెక్కును బహుకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

నంద్యాల

ఇంజనీర్లకు పురస్కారాలు.. ఘన సత్కారం

నంద్యాల: మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్ల సంఘాలు, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ పీజీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్వేశ్వరయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 30 మంది ఇంజనీర్లు రక్తదానం చేశారు. ఉత్తమ సేవలందించిన 7 గురు ఏఈలు, 29 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ప్రశంసా పత్రాలు, క్రీడల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈఈ రఘురామిరెడ్డి, విశ్రాంత ఇంజనీర్లకు పురస్కారాలు అందించి సత్కరించారు. అలాగే నవజీవన్ బదిరుల పాఠశాలకు రూ.12 వేల విరాళం ప్రకటించారు. విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ఇంజనీర్లు జాతి నిర్మాణానికి కృషి చేయాలని ఈఈ రఘురామిరెడ్డి పిలుపునిచ్చారు.

నంద్యాల

బాల అకాడమీ ప్రిన్సిపాల్‌కు ‘శిక్షా రత్న’ పురస్కారం

హైదరాబాద్: విద్యారంగంలో నూతన సంస్కరణలు అమలు చేస్తూ పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న బాల అకాడమీ ప్రిన్సిపాల్ శ్రీమతి మాధవీలత గారు ప్రతిష్ఠాత్మక ‘శిక్షా రత్న అవార్డు–2026’ సాధించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హరి యూనివర్సిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలను పెంపొందిస్తూ పాఠశాలను ప్రగతిపథంలో నడిపిస్తున్నందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇది తన వ్యక్తిగత అవార్డు కాదని, బాల అకాడమీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమిష్టి కృషికి లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. మాధవీలత విజయం పట్ల పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

నంద్యాల

వైభవంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నంద్యాల: నంద్యాలలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. 50 బ్యాచ్‌లకు చెందిన దాదాపు 600 మందికి పైగా పూర్వ విద్యార్థులు హాజరై, తమ ఉపాధ్యాయులను ‘గురు వందన రథం’పై పూలవర్షం మధ్య ఊరేగింపుగా పాఠశాలకు తీసుకెళ్లారు. అనంతరం ప్రమద నంది కళ్యాణ మండపంలో గురువులను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. పాఠశాల పూర్వ వైభవానికి, అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని పూర్వ విద్యార్థులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నివర్తి మోహన్, విశ్రాంత, ప్రస్తుత ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

నంద్యాల

అచీవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

నంద్యాల:స్థానిక అచీవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూక్లియస్ కాలేజ్ కరస్పాండెంట్ మురళీధర్ రెడ్డి, ప్రముఖ తెలుగు పండితులు సుబ్బన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు బోధించడమే కాకుండా విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పి సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు. విద్యార్థులు గురువులను గౌరవిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాల కరస్పాండెంట్ వై. శ్రీనివాస్, డైరెక్టర్ ఈశ్వర్ చంద్ర, A.O. మానస, ప్రిన్సిపల్ ఎం.పీ. లావణ్యలు మాట్లాడుతూ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే మహత్తర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసంగాలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రెసిడెంట్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నంద్యాల

రావుస్ జూనియర్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

నంద్యాల : స్థానిక శ్రీనివాసనగర్‌లోని రావుస్ జూనియర్ కళాశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది అధ్యాపకులను విద్యార్థులు ఘనంగా సన్మానించారని కళాశాల డైరెక్టర్ ఎ. మోని చంద్ర, ప్రిన్సిపల్ రొడ్డ సుంకయ్య తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన ‘విద్యార్థి అభివృద్ధిలో ఉపాధ్యాయుని పాత్ర’ వ్యాసరచన పోటీ విజేతలతో పాటు, క్వార్టర్లీ మరియు వార్షిక పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 20 మంది ఉత్తమ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.డైరెక్టర్ మోని చంద్ర మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రుల స్ఫూర్తితో అధ్యాపకులందరూ విలువలతో కూడిన, నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ రొడ్డ సుంకయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, గత 35 ఏళ్లుగా రావుస్ విద్యాసంస్థల విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, సిఏలుగా స్థిరపడటం గర్వకారణమని అన్నారు. సంస్థల వ్యవస్థాపక చైర్మన్ ఎ.ఎం.వి. అప్పారావు కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

నంద్యాల

రెడ్‌క్రాస్ సభ్యత్వం తీసుకోండి: ఉద్యోగులకు నంద్యాల కలెక్టర్ పిలుపు

నంద్యాల జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీని బలోపేతం చేయడంతో పాటు రక్త నిల్వలను పెంచేందుకు ఉద్యోగులంతా జీవితకాల సభ్యత్వం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. రూ.1,000 చెల్లించి జీవితకాల సభ్యులుగా చేరవచ్చని తెలిపారు.ఇప్పటికే జిల్లా పరిషత్‌కు చెందిన 30 మంది సిబ్బంది సభ్యత్వం తీసుకొని రూ.33 వేలు అందించారని, గతంలో 56 మంది సభ్యత్వం ద్వారా రూ.61,600 సమకూరినట్లు చెప్పారు. రెడ్‌క్రాస్ సభ్యులకు తక్కువ ధరకే రక్తం అందించడంతో పాటు సీపీఆర్ వంటి అత్యవసర సేవల్లో శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందించేందుకు రూ.2 కోట్లతో ‘అంబులెన్స్ ఆసుపత్రి’ని కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. అధికారులు చొరవ తీసుకుని యూత్, జూనియర్ రెడ్‌క్రాస్ ద్వారా యువ రక్తాన్ని ప్రోత్సహించి సభ్యత్వాలను పెంచాలని కలెక్టర్ సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.