Sunday, 27 September 2026

Tag: పోలీస్

ఖమ్మం

కారు ఢీకొని పారిశుధ్య కార్మికురాలు మృతి..

ఖమ్మం నగరంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బోనకల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మామిడి నాగమ్మ మృతి చెందారు. రోడ్డు దాటుతున్న నాగమ్మను కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనతో మున్సిపల్‌ కార్మికులు, సహచరుల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు, కారు వివరాలు, డ్రైవర్‌ పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మం

ఆగి ఉన్న లారీని ఢీకొన్న డీసీఎం.. డ్రైవర్ మృతి

పెనుబల్లి / ఖమ్మం పెనుబల్లి మండల పరిధిలోని కండిమల్లవారి బంజర్ వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వంగ ముత్యాల బంజర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మారాటిగా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

ఖమ్మం

ఉద్యోగోన్నతితో బాధ్యత మరింత పెరిగింది: సీపీ సునీల్ దత్

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిటీ ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ ఏఆర్ఎస్సైగా ఉద్యోగోన్నతి పొందిన కె. ఆదినారాయణ, షేక్ ఖాసీం సాహెబ్, ఏ. రామస్వామిలను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. ఉద్యోగోన్నతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన, నూతన హోదాకు అనుగుణంగా మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ శాఖలో ఉద్యోగోన్నతి కేవలం హోదా పెరగడమే కాకుండా బాధ్యతలను మరింత పెంచుతుందని పేర్కొన్నారు. క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సీపీ సూచించారు. ఉద్యోగోన్నతి పొందిన అధికారులు తమ విధుల్లో నిబద్ధతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఖమ్మం

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణకు అగ్రస్థానం

దేశంలో సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో తెలంగాణ రాష్ట్రం మరోసారి మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రధానమంత్రి అధ్యక్షతన నిర్వహించిన ప్రగతి సమీక్ష సమావేశంలో సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించి అన్ని ప్రమాణాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగాలు చేపడుతున్న చర్యలకు ఇది గుర్తింపుగా నిలిచింది. ఫిర్యాదుల స్వీకరణ, నేరాల దర్యాప్తు, బాధితులకు సత్వర సహాయం, నేరస్తులపై చర్యలు వంటి అంశాల్లో తెలంగాణ మెరుగైన పనితీరు కనబరిచినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ పనితీరును అభినందిస్తూ, సైబర్ నేరాల నియంత్రణలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

ఖమ్మం

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన హాజరై న సి సి పి యస్. డి ఎస్పీ ఫణింధర్

ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఫర్ ఉమెన్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీపీఎస్ డీఎస్పీ ఫణీందర్ సర్ విద్యార్థులకు సైబర్ మోసాలపై వివరించారు. ముఖ్యంగా వ్యాపారం, పెట్టుబడుల పేరుతో జరిగే మోసాలు, నకిలీ స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడి స్కామ్‌లు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్‌లో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, పెట్టుబడి ఆఫర్లు, ఉద్యోగ ప్రకటనలను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీలు పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఫణీందర్ తెలిపారు.

ఖమ్మం

పీడీఎస్ బియ్యం బ్లాక్ మార్కెటింగ్‌.. నిందితుడిపై పీడీ యాక్ట్

ఖమ్మం: పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అంతర్రాష్ట్రాలకు తరలిస్తూ బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న నిందితుడిపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మీర్జా జిలానీ బేగ్ (48)పై ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రేషన్ డీలర్లు, వారి ఏజెంట్ల ద్వారా కార్డుదారులకు అందాల్సిన సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్న జిలానీ బేగ్‌పై తల్లాడ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయని తెలిపారు. BNS, ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్, తెలంగాణ పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్స్ కింద కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. గతంలో పలుమార్లు కేసులు నమోదై, BNSS సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేసినా నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదని సీపీ తెలిపారు. దీంతో పీడీ యాక్ట్ అమలు చేసి వైరా సీఐ వెంకట ప్రసాద్, తల్లాడ ఎస్సై వెంకట కృష్ణ నిందితుడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించినట్లు వెల్లడించారు. పీడీఎస్ బియ్యం అక్రమ కొనుగోలు, నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ సునీల్ దత్ స్పష్టం చేశారు.

ఖమ్మం

గుండెపోటుతో ఎస్‌ఐ అనంత రాములు మృతి

ఖమ్మం: ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న అనంత రాములు సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. గత రెండు రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు సోమవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సప్తగిరి కాలనీలో అనంత రాములు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన మృతి పట్ల పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో ఆయన అందించిన సేవలను పలువురు గుర్తు చేసుకున్నారు. ఆయన మృతితో సప్తగిరి కాలనీతో పాటు పోలీస్ వర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఖమ్మం

రఘునాథపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం

రఘునాధపాలెం /ఖమ్మం : రఘునాథపాలెం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జింకల తండా వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఇల్లందు నుంచి ఖమ్మం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న 8 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం. బైక్‌ నడుపుతున్న 17 ఏళ్ల యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంతో రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఖమ్మం

దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్ రూ.లక్ష విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం

ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.లక్ష విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 12న రాత్రి 11 గంటల సమయంలో జహీరపుర, గుట్టల బజార్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంటిని నిందితుడు తుడుము గోపి (28) గమనించాడు. తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలు, నగదును చోరీ చేశాడు. చోరీ సొత్తును విక్రయించేందుకు శుక్రవారం గాంధీచౌక్‌లోని బంగారు షాపుల సముదాయం వద్దకు వచ్చిన గోపి, అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంబడించి పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి 6.25 గ్రాముల బంగారం, 81 గ్రాముల వెండి, రూ.7 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో POCSO, కొట్లాట కేసులు నమోదై కోర్టు విచారణలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాలతో జైలుకు తరలించారు.

ఖమ్మం

అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద విస్తృత వాహన తనిఖీలు ఎర్రుపాలెం రింగ్ సెంటర్‌లో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన: పాల్గొన్న ఎసిపీ సారంగా పాణి

ఎర్రుపాలెం /ఖమ్మం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రింగ్ సెంటర్‌లోని అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు వైరా ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో మధిర రూరల్ సీఐ, మధిర టౌన్ సీఐ, వైరా సీఐ, సబ్‌ డివిజనల్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. కార్లు, ఇతర వాహనాల్లో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. వాహనాలకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పోలీసులకు సహకరించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడకుండా సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.