Monday, 21 September 2026

Tag: రంగారెడ్డి జిల్లా

మేడ్చల్ – మల్కాజిగిరి

శభాష్ సాయి చరణ్.. హెచ్‌పీసీఎల్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపిక

పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం,జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన చిలుకల సాయి చరణ్ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికై కాలనీకి గర్వకారణంగా నిలిచాడు. బ్లాక్ నంబర్ 38లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న సాయి చరణ్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి సందీప్ కుమార్ క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన సాయి చరణ్, ప్రస్తుతం మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. హెచ్‌పీసీఎల్ నియామక ప్రక్రియలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. శిక్షణ నిమిత్తం భువనేశ్వర్‌కు వెళ్తున్న సందర్భంగా సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ సురక్ష కార్యాలయంలో సాయి చరణ్‌ను ఘనంగా సన్మానించారు. తన విజయానికి గోపీ శంకర్ యాదవ్ మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడిందని సాయి చరణ్ తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ యువత సాయి చరణ్‌ను ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని గోపీ శంకర్ యాదవ్ కోరారు. కార్యక్రమంలో సురక్ష సభ్యులు యాకూబ్, సందీప్ కుమార్ పాల్గొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

పదవీవిరమణ బాధ్యతకే ముగింపు.. సేవలకు కాదు, ఇంద్రసేనారెడ్డి సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్ మెట్ మండలం, పంచాయతీరాజ్ శాఖ డీఈగా విధులు నిర్వహించిన ఇంద్రసేనారెడ్డి ప్రభుత్వ సేవల్లో అంకితభావంతో పనిచేసి ప్రజలకు విశేష సేవలందించారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కొనియాడారు. పెద్దఅంబర్‌పేట్‌లో జరిగిన ఇంద్రసేనారెడ్డి పదవీవిరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశమని, పంచాయతీరాజ్ శాఖలో ఇంద్రసేనారెడ్డి అందించిన సేవలు అభినందనీయమన్నారు. పదవీవిరమణ ఒక బాధ్యతకు ముగింపు మాత్రమేనని, సమాజానికి చేసిన సేవలకు ముగింపు కాదన్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఇంద్రసేనారెడ్డి దంపతులను సన్మానించారు.

రంగారెడ్డి

సామాజిక సేవలకు గుర్తింపుగా రేవల్లే మదన్ (మస్తాన్)కు గౌరవ డాక్టరేట్

పున్నమి: రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌ మెట్ మండలం, పెద్ద అంబర్‌పేట్ జీహెచ్‌ఎంసీ పరిధి, పసుమాముల గ్రామం, కళానగర్ కాలనీకి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త రేవల్లే మదన్ (మస్తాన్) గారికి ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ అవార్డు లభించింది. నిస్వార్థంగా సమాజ సేవ చేసే వారికి ఎప్పటికైనా, ఎక్కడైనా తగిన గౌరవం లభిస్తుందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్‌షిప్ అండ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో, సంస్థ డైరెక్టర్ మరియు తమిళనాడు న్యాయవ్యవస్థ మాజీ న్యాయమూర్తి గౌరవనీయ డా. కె. వెంకటేశన్ చేతుల మీదుగా తమిళనాడు–పుదుచ్చేరి ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో రేవల్లే మదన్ కు గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్. శంపత్, ఐ.ఏ.ఎస్. (రిటైర్డ్), తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఇండియా కంట్రీ డైరెక్టర్ సుకుమార్, డిప్యూటీ డైరెక్టర్ విజయ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. రేవల్లే మదన్ ట్రీస్ సొసైటీ చైర్మన్‌గా గత కొన్ని సంవత్సరాలుగా అనేక సామాజిక, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, వొకేషనల్ ట్రైనింగ్, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛ సర్వేక్షణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, విద్య, వైద్యం, బాలల హక్కుల పరిరక్షణ తదితర రంగాల్లో చురుగ్గా సేవలందిస్తున్నారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్‌షిప్ అండ్ ఎక్సలెన్స్ సంస్థ రేవల్లే మదన్ గారికి ఈ ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా రేవల్లే మదన్ ని పలువురు సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు. భవిష్యత్తులో కూడా మరింత విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని రేవల్లే మదన్ తెలిపారు.

రంగారెడ్డి

రక్షాబంధన్ వేడుకల్లో అన్నాచెల్లెళ్ల ఆత్మీయత, అక్కాచెల్లెళ్ల చేతుల మీదుగా దూపం చరణ్‌కు రాఖీ కట్టిన వేడుకలు

పున్నమి: రంగారెడ్డి జిల్లా, రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దూపం కుటుంబంలో అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతలు వెల్లివిరిశాయి. రక్షాబంధన్ వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించి, సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కలు దూపం పావని, దూపం లక్ష్మీ ప్రియ, చెల్లెలు దూపం దేవి ప్రియ కలిసి అన్నయ్య, తమ్ముడు దూపం చరణ్‌కు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కట్టిన అనంతరం అన్నాచెల్లెళ్లు పరస్పరం ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధానికి, ప్రేమకు, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్ననాటి నుంచి కొనసాగుతున్న అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని మరింత బలపరిచేలా ప్రతి ఏడాది రాఖీ పండుగను ఆనందంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దూపం చరణ్ మాట్లాడుతూ, అక్కాచెల్లెళ్లు తనకు రాఖీ కట్టడం ఎంతో సంతోషంగా ఉందని, వారి ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ తనకు ప్రత్యేకమని తెలిపారు. అక్కాచెల్లెళ్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సంతోషమే తనకు ముఖ్యమని అన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ రక్షాబంధన్ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు.

రంగారెడ్డి

దద్దరిల్లిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ – ఏబీవీపీ ఆధ్వర్యంలో 1,500 మందితో భారీ ముట్టడి, విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున – స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఏబీవీపీ సమరశంఖం, విద్యార్థుల హక్కుల కోసం పోరుబాట – రంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడించిన ఏబీవీపీ,

పున్నమి: రంగారెడ్డి జిల్లా, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద వేలాది మంది విద్యార్థులతో ఏబీవీపీ భారీ ఆందోళన చేపట్టింది. సుమారు 1,500 మంది ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించడంతో ప్రాంగణం మొత్తం ఆందోళన నినాదాలతో మార్మోగింది. స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి” అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ వీరపట్నం జిల్లా కన్వీనర్ జగదీష్ మాట్లాడుతూ, విద్యార్థులకు అందాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లల చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం హామీలకే పరిమితం కాకుండా వెంటనే కార్యాచరణ చేపట్టాలని జగదీష్ డిమాండ్ చేశారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ప్రభుత్వం విద్యార్థుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే నిధులు విడుదల చేయాలని, లేనిపక్షంలో ఏబీవీపీ చూస్తూ ఊరుకోదని, రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతమైన విద్యార్థి ఉద్యమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. కలెక్టరేట్ ముట్టడితో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. విద్యార్థుల ఆగ్రహాన్ని ప్రభుత్వం ఇకనైనా గుర్తించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో 1 స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్ల కేడి సాయిచరణ్ నేషనల్ కళామంచ్ కో కన్వీనర్ మణికంఠ విభాగ్ కన్వీనర్ ప్రదీప్, శంషాబాద్ జిల్లా కన్వీనర్ పవన్, స్టేట్ టెక్నికల్ సెల్ ఫోన్ లో గుణవంత్ రెడ్డి ,స్టేట్ ఎస్ఎఫ్ఎస్ పుష్పల ఆదర్శ్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేందర్, భరత్ , మైపాల్ స్టేట్ వనవాసి కో కన్వీనర్ రాజేష్ , నగర కార్యదర్శి గంగవరం వినయ్ , దేవరశెట్టి ప్రణీత్ దండు కార్తీక్, , రామ్ చరణ్ , నవదీప్ , భరత్ వంశీ బన్ను , సందీప్ మల్లేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.