సర్దార్ పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకు సాగాలి
ఇబ్రహీంపట్నంలో ఘనంగా జయంతి వేడుకలు.. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం: ప్రజల కోసం మొఘల్ చక్రవర్తులను సైతం ఎదిరించి పోరాడిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. తెలంగాణ గడ్డపై నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన పాపన్నగౌడ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమని, ఆయన స్ఫూర్తిని ప్రజల్లో మరింతగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా ప్రజానేత ధర్మభిక్షం విగ్రహాన్ని కూడా ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కులవృత్తులు, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మల్‌రెడ్డి రంగారెడ్డి కోరారు. ముఖ్యంగా గీత కార్మికుల జీవనాధారమైన తాటిచెట్లను అక్రమంగా నరికే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాటిచెట్లను నరికే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించాల్సిన అవసరం లేదని, కులవృత్తుల పరిరక్షణ కోసం అవసరమైతే మరో పాపన్నగౌడ్‌లా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ప్రజల హక్కులు, సామాజిక సమానత్వం కోసం పాపన్నగౌడ్ చూపిన బాటలో నేటి యువత నడవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జయంతి వేడుకల్లో పాల్గొన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, గౌడ సంఘాల ప్రతినిధులు పాపన్నగౌడ్ సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు.





