తేది:19-05-2026 పున్నమి ప్రతినిధి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్పీఎం గేటు ముందు నిర్వహించిన సమావేశంలో రిజిస్ట్రేషన్ నెంబర్ E-2381 కార్యనిర్వాహక అధ్యక్షులు గోలెం వెంకటేశం మాట్లాడుతూ, 2018 తర్వాత ఇప్పటివరకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకుండా JK యాజమాన్యం జాప్యం చేస్తోందని ఆరోపించారు.
బయటి రాష్ట్రాల కార్మికులకు అధిక వేతనాలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, స్థానిక కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక కార్మికులకు కనీసం రూ.20 వేల వేతనం కూడా అందకపోవడం దారుణమన్నారు. అలాగే SPM పునఃప్రారంభం తర్వాత సుమారు 250 మంది శాశ్వత కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా యాజమాన్యం అన్యాయం చేసిందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న IR కోడ్ల పేరుతో, కోర్టు వ్యవహారాలను కారణంగా చూపిస్తూ యాజమాన్యం కాలయాపన చేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని ఇతర కంపెనీలలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించినప్పటికీ, సిర్పూర్ పేపర్ మిల్లులో మాత్రం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు కార్మిక శాఖ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
తక్షణమే కార్మిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోతే, రెండు రోజుల తర్వాత టెంటు ద్వారా రిలే నిరాహార దీక్షలు చేపడతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ నిర్ణయానికి కార్మికులందరూ కట్టుబడి ఉన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు సి. వెంకటేష్, 1028 సంఘం నాయకులు కలికోట రమణయ్య, 2735 సంఘం నాయకులు గోగర్ల రాములు, రాజేష్ యాదవ్, జాడి అశోక్, సీఐటీయూ నాయకులు ముంజ్యం శ్రీనివాస్, షెబ్బీర్ పాషా, 966 సంఘం నాయకులు గోగర్ల కన్నయ్య, కంబాల ఓదెలు, 2381 సంఘం నాయకులు అశ్విని కుమార్ సింగ్, జాను ప్రకాష్, నానయ్య, వల్లాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


