Friday, 10 July 2026

Blog

Featured

నెల్లూరు అపోలో హాస్పిటల్ కిడ్నీ సమస్యలపై ప్రజల్లో అవగాహాన*: డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వలీ*

*కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోండి : ప్రపంచ కిడ్నీ దినోత్సవంలో అపోలో వైద్యుల పిలుపు*   _*- నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం*_ _*- మీడియాతో డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వలీ*_ _*- 100కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు వెల్లడి*_ _*- అన్నీ జబ్బులకు కిడ్నీ సమస్యలే కారణమన్న వైద్యులు*_ _*- కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని పిలుపు*_   నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో 100కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించామని, వారంతా పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నారని అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, నెఫ్రాలజీ విభాగ అధిపతి డాక్టర్ ఏ.కే. చక్రవర్తి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి. మస్తాన్ వలీ వెల్లడించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హాస్పిటల్ లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రక్తాన్ని వడపోసే కిడ్నీలు దెబ్బతింటే దాని ప్రభావం శరీరమంతా ఉంటుందని, వివిధ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని అన్నారు. కిడ్నీకి సమస్య తలెత్తిన వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రతీ 10 మందిలో ఒకరికి కిడ్నీ సమస్య ఉంటుందని, సాధారణ వ్యక్తుల కంటే కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో గుర్తించినట్లు డాక్టర్ శ్రీ రామ్ సతీష్, డాక్టర్ ఏకే చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వలీ వెల్లడించారు.     కిడ్నీ సమస్యలు ఎదుర్కొనే వారికి గుండెపోటుతో పాటూ ఇతర స్ట్రోకులు, ఫ్రాక్చర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ఇతర జబ్బులు సోకకుండా ఉంటాయని వారు తెలియజేశారు. షుగర్, అధిక రక్తపోటు, ఊబకాయం సమస్యలతో బాధపడే వారికి కిడ్నీ సమస్యలు అధికంగా వస్తాయని కనుక ఆయా సమస్యలతో బాధపడే వారు సరైన చికిత్స తీసుకుంటే కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చునని చెప్పారు. పరిశుభ్రమైన మంచినీరు తాగడం మూలంగా కూడా కిడ్నీ సమస్యలు దూరమవుతాయన్నారు. జనాభాలో 10 శాతం మంది ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని, దీనిపై ప్రభుత్వం ఆలోచించి, కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ఇప్పటి వరకూ 100కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని, వారంతా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు. కిడ్నీ సమస్యల చికిత్సతో పాటూ శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు అపోలో హాస్పిటల్ లో అనుభవజ్ఞులైన వైద్యులతో పాటూ అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, కిడ్నీ రోగులు అపోలో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కిడ్నీ సమస్యలపై ప్రజల్లో అవగాహాన కల్పించేందుకు ఈ ఏడాది ” ఆర్ యూ కిడ్నీ ఓకే ?, డిటెక్ట్ అర్లీ, ప్రొటెక్ట్ కిడ్నీ హెల్త్… ! ” అనే నినాదంతో ముందుకెళుతున్నామని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో వారితో పాటూ హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు కూడా పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

కార్పొరేషన్ లోని పార్కులను ఆధునీకరించాలి – ముక్కు రాధాకృష్ణ గౌడ్

కార్పొరేషన్ లోని పార్కులను ఆధునీకరించాలి – ముక్కు రాధాకృష్ణ గౌడ్ నెల్లూరు మార్చి ( పున్నమి ప్రతినిధి) నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్ ఇంజనీర్లను కార్పోరేషన్ లోని పార్కుల సమస్యలపై జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ కలిసి వినతిపత్రం సమర్పించారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 64 పార్కులు ఉన్నాయని సహజంగా పార్కుల్లో వాకింగ్ ట్రాక్లు, యోగా సెంటర్లు, మినీ జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్, షటిల్ కోర్టులు, కబడ్డీ కోర్టులు వివిధ ఆటలకు సంబంధించిన గేమ్స్ కు సంబంధించిన కోర్టులు చిన్నపిల్లలకు ఆట వస్తువులు వివిధ బొమ్మలు వృద్ధులకు సిమెంట్ బల్లలు, స్కేటింగ్ కోర్టు లు, కరాటే కోర్టులు, మంచినీరు పచ్చని మొక్కలు విద్యుత్ సౌకర్యం టాయిలెట్స్ డ్రైనేజీ సిస్టం మొదలగునవి తప్పకుండా ఉండాల్సి ఉండగా లేవని పేర్కొన్నారు.కానీ కొన్ని పార్కులలో ఇవన్నీ నిరుపయోగంగా ఉన్నాయని పరికరాలను జిమ్ములను తక్షణమే అభివృద్ధి పరచాలని వాకింగ్ ట్రాక్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలని అదేవిధంగా కొత్త కొత్త జాతుల మొక్కలను పెంచాలని ప్రైవేట్ వ్యక్తుల నుండి వారి ఆక్రమణల నుండి పార్కులను కాపాడాలని కోరారు.అధికారులు నిత్యం అన్ని పార్కులను విధిగా విజిట్ చేయాలని పార్కుల్లో ఆహ్లాదాన్ని అందాన్ని ఆక్సిజన్ ని ఇచ్చే మొక్కలను ఎక్కువ సంఖ్యలో పెంచాలని కార్పొరేషన్ పరిధిలోని అన్ని పార్కులలో వ్యాపార సంస్థలు లాభాపేక్షతో చేసే కార్యక్రమాలకు విధిగా రుసుమును వసూలు చేయాలని అలాగే కార్పొరేషన్ పరిధిలోని అన్ని పార్కులలో వ్యామకారులకు, క్రీడాకారులకు, వాకర్స్కు వారి అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసుకునేందుకు పార్కులో ఉచిత వసతిని ఏర్పాటు చేయాలని ఉచిత శిక్షణా తరగతులు ఉచిత పౌచ్ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాలు, ఆరోగ్యానికి సంబంధించిన వ సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు జరుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎక్కడికక్కడ స్థానిక పార్కులలో ఉచిత అనుమతులు ఇవ్వాలని జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ తరపున కోరారు. పై కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు కాయల.మధు పులిచెర్ల. ఉదయ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు తిరకాల.శివ గౌడ్ జిల్లా కార్యదర్శులు తణుకు.ముని బాబు పైడి.చరణ్ తేజ మరియు తదితరులు పాల్గొన్నారు.*

Featured ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీని సందర్శించిన ఏపీఐఐసీ చైర్మన్

  ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్ ఎం.రామరాజు శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ డైరెక్టర్ ముకుంద రెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, పారిశ్రామికవాడ ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు. రామరాజు ఎంతో ఆసక్తితో శ్రీసిటీలోని వివిధ అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం శ్రీసిటీ పరిసరాలలో పర్యటించి పారిశ్రామిక కార్యకలాపాలను వీక్షించారు. పెప్సికో పరిశ్రమను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించారు. రామరాజు పర్యటనను తాము గౌరవప్రదంగా భావిస్తున్నామని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇది మొట్టమొదటి శ్రీసిటీ సందర్శన కాగా, ఆయన పరిశీలనలు, సూచనలు తమకెంతో విలువైనదంటూ తన సందేశంలో పేర్కొన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ తో పాటు ఏపీఐఐసి జోనల్ మేనేజర్ విజయ భరత్ రెడ్డి ఈ పర్యటనలో పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీని పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు సుస్థిర చర్యలు

శ్రీసిటీని పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు సుస్థిర చర్యలు  – నిర్మాణ పనులలో ఎం-సాండ్ వినియోగం, మట్టి పునర్వినియోగంపై మార్గదర్శకాలు     ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ఛైర్మన్ డా. పి. కృష్ణయ్యతో ఇటీవల చర్చల అనంతరం, శ్రీసిటీని మరింత పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు, శ్రీసిటీ యాజమాన్యం తన పారిశ్రామిక భాగస్వామ్యులతో కలిసి స్థిరమైన వనరుల వినియోగ విధానాలను మరింత బలోపేతం చేస్తోంది. “రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ” అనే వృత్తాకార ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ) మూల సూత్రాల ఆధారంగా పర్యావరణ హాని గణనీయంగా తగ్గించే చర్యలు చేపడుతోంది.    ఇందులో భాగంగా అన్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణ పనులలో నది ఇసుక వాడకానికి ప్రత్యామ్నాయమైన ఎం-సాండ్ (గ్రానైట్ రాళ్లను పొడిచేయడం ద్వారా తయారయ్యే ఇసుక) ను విధిగా 90 శాతం ఉపయోగించాలని, నది ఇసుక వినియోగాన్ని కేవలం 10 శాతానికి  పరిమితం చేయాలని నిర్ణయించింది. మరియు, ఫిల్లింగ్ కొరకు బయట మట్టిని కొనుగోలు చేయడం తగ్గించి, ఆయా ప్లాట్లలో తవ్విన మట్టినే ఉపయోగించే  విధానాన్ని ప్రోత్సహించనున్నారు. దీనితో పాటు, భూఉపరితలాన్నీ సమర్థవంతంగా నిర్వహించి, వర్షపు నీటి సంరక్షణ, నీటి నిల్వ సమస్యలకు తగు ఉత్తమ పరిష్కారాలు చూపనున్నారు.   శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి దీనిపై వ్యాఖ్యానిస్తూ, హరిత నగర లక్ష్యాన్ని సాధించే దిశగా సుస్థిర వనరుల నిర్వహణ మరియు పర్యావరణహిత కార్యకలాపాలను అమలు చేయడంలో శ్రీసిటీ ఎప్పుడూ ముందుందన్నారు. సర్క్యులర్ ఎకానమీ సూత్రాలను అవలంభించడం ద్వారా స్థిరమైన పారిశ్రామిక వృద్ధికి దోహదపడే చర్యలను అమలు చేస్తున్నామని చెప్పారు.    అంతేకాక, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంపొందించడం, భారీ స్థాయిలో వర్ష జల సంరక్షణ, నీటి పునర్వినియోగం, భూగర్భజల రక్షణ, జీరోవేస్ట్ విధానాల అమలు, పరిశ్రమల పరస్పర సహకార వ్యవస్థ, మొత్తం విస్తీర్ణంలో 40% హరిత పరిసరాలను అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలు శ్రీసిటీ అభివృద్ధి వ్యూహంలో భాగంగా తాము కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.   కాలుష్య రహిత ఇంధన (క్లీన్ ఎనర్జీ) వినియోగాన్ని వేగవంతం చేసేందుకు,  AG&P పైప్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (సి.ఎన్.జి)ను శ్రీసిటీ అందుబాటులోకి తెస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని అందించే ఈ పద్ధతి వల్ల ఉత్పత్తి నాణ్యత మెరుగుపడటమే కాకుండా, బొగ్గు వాడకంతో ఏర్పడే పొల్యూషన్ బెడదను అరికడుతుంది. పారిశ్రామిక సంస్థలు వీలైనంత త్వరగా సి.ఎన్.జి. కి మారడం ద్వారా ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని శ్రీసిటీ ఎండీ సూచించారు.    ఈ నూతన విధానాల అమలు ద్వారా పారిశ్రామికాభివృద్ధికి,  పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యతను నెలకొల్పి, ప్రముఖ సుస్థిర పారిశ్రామిక కేంద్రమైన శ్రీసిటీ తన నిబద్ధతను చాటుకుంటోంది. 

Featured ఆంధ్రప్రదేశ్

జనసేన ఆవిర్భావ దినోత్సవానికి ఉప్పెన గా రావాలి :గాలిపెల్లి కుమార్

పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవానికి ప్రతి జన సైనికుడు అభిమాని కదలిరావాలి గాలిపెల్లి కుమార్ పిలుపు పిఠాపురంలో ఈనెల 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం కోసం జనసైనికులు, అభిమానులు భారీగా కదలి రావాలని జనసేన భవిష్యత్తును తట్టిలేపే ఈ మహాసభను విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా నుంచి అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావాలని సమాజ సేవకులు మెగా డిజిటల్ టీం కరీంనగర్ అధ్యక్షుడు గాలిపెల్లి కుమార్ పిలుపునిచ్చారు. పార్టీకి ఐలం చేకూర్చాలంటే ప్రతి కార్యకర్త, అభిమాని ముందుకు రావాలని జనసేన పార్టీ ప్రజల భవిష్యత్తు కోసం, మార్పు కోసం పోరాడుతోందని ఆ పోరాటంలో ప్రతి జన సైనికుడు భాగస్వామి కావాలని గాలిపెల్లి కుమార్ హితవు పలికారు. “ఇది కేవలం ఆవిర్భావ దినోత్సవం మాత్రమే కాదు, జనసేన బలాన్ని, మన అంకితభావాన్ని నిరూపించే వేదికని పసుపులేటి రాము అన్నారు. వెనుకడుగు వేసే అవకాశం లేదని ప్రతి కార్యకర్త, అభిమాని ఓ సైన్యం లా పిఠాపురం వైపు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఛలో పిఠాపురం మహాసభలో పార్టీ భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని అందుకే ఒక్కొక్కరుగా కాకుండా వేలాదిగా ఈ ఆవిర్భావ దినోత్సవానికి భారీగా తరలిరావాలని పసుపులేటి రాము సూచించారు. ఈ సభను అఖండ విజయంగా మలిచి జనసేన శక్తిని ప్రపంచానికి చాటాలని ఆయన అన్నారు. జనసేన అధినేత “పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నూతన రాజకీయ మార్గం సిద్ధమవుతోందని ఆ మార్పుకు మనం భాగస్వాములం కావాలని ఛలో పిఠాపురం మహాసభకు హాజరై జనసేన గళాన్ని మరింత బలంగా మార్చాలని గాలిపెల్లి కుమార్ స్పష్టం చేశారు.

Featured ఆంధ్రప్రదేశ్

సోము వీర్రాజుకు MLC పదవి పై హర్షం”: ముక్కు రాధాకృష్ణ గౌడ్

” బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేరును కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నెల్లూరు జిల్లా నుంచి ఓబీసీ మోర్చా కోస్తా ఆంధ్ర జోనల్ ఇంచార్జ్ ముక్కు రాధాకృష్ణ గౌడ్ , బిజెపి కోపరేటివ్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ కోట వెంకటేశ్వర్లు మరియు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్ర తదితరులు విజయవాడలోని రాష్ట్ర కార్యాలయము నందు ఆయనను కలసి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోము వీర్రాజు చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్ విద్యార్థి దశలో ఏబీవీపీ అలాగే యువమోర్చా నుండి తన రాజకీయ ప్రస్థానం మొదలై రాష్ట్ర జాతీయ పదవులను నిర్వహించి వాటికి వన్నెతెచ్చారని. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీ కార్యకర్తలను కాపాడుకున్నారని అటువంటి నాయకునికి పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్సీ ని కేటాయించడం ప్రతి కార్యకర్త గర్వించదగినటువంటి విషయమని అన్నారు. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ని ప్రకటించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారని నిజమైన కార్యకర్తకు గౌరవం దక్కిందని ఆనందిస్తున్నారని ఇది కేవలం బిజెపి పార్టీలో మాత్రమే జరుగుతుందని మిగతా రాజకీయ పార్టీలలో సాధ్యం కాదనితెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్

తెలుగు తమ్ముళ్ళు బాధ అంత ఇంత కాదు????

తొమ్మిది నెలలకు ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,చోటా నాయకులు..పార్టీ అధికారంలోకి వస్తే..తమను అందలం ఎక్కిస్తారని, తాము చేసిన పోరాటాలకు గుర్తింపునిస్తారని, తమను అధినేత, ఆయన కుమారుడు నెత్తినపెట్టుకుని చూసుకుంటారని, రాష్ట్రం బాగుంటుందని, అభివృద్ధి చెందుతుందని, తమను అవమానించిన, హింసించిన వారికి తగిన గుణపాఠం నేర్పుతారని, ఇలా ఎన్నెన్నో ఊహించుకున్నారు. అయితే..అధికారంలోకి వచ్చిన తరువాత వారి ఊహలన్నీ క్రమంగా చెరిగిపోతూ ఉన్నాయి. తమను హింసించిన వారిని, తమ కార్యకర్తలను హత్యలు చేసినవారి, దోపిడీకి పాల్పడిన వారిని, అధికార మదంతో..ఊరేగిన వారిని, హత్యా రాజకీయాలతో చెలరేగిన ఉన్మాదులను ‘చంద్రబాబు’ శిక్షస్తారని వారు అనుకుంటే..అవేమీ జరగకపోగా…వారు దర్జాగా రోడ్లపై కాలరెగెరేసి తిరుగుతుంటే..‘ఈయన రాజకీయం ఇంతేలే..’ అంటూ చాలా చోట్ల సరిపెట్టుకుంటున్నారు. అయితే..ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన రాజకీయం వల్ల నిన్నటి దాకా..అధినేతను, టిడిపి పార్టీనీ, అధినేత బంధువులను పిచ్చితిట్లు తిట్టినవారికి ఎమ్మెల్సీ సీట్లు వస్తుండడంతో..కార్యకర్తలు తీవ్ర నిరాశ,నిస్రృహ,నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి భాగస్వామ్య పార్టీలకు ఇచ్చిన ఎమ్మెల్సీసీట్లలో ‘జనసేన’, ‘బిజెపి’లు నిర్ణయించిన అభ్యర్థులపై ‘టిడిపి’ కార్యకర్తలు, నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ‘జనసేన’ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ‘పవన్‌ కళ్యాణ్‌’ సోదరుడు ‘నాగబాబు’కు మొదటి నుంచి ‘టిడిపి’కి వ్యతిరేకమే. గతంలో ఆయన ‘చంద్రబాబు’ను, ఆయన బావమరిది ఎమ్మెల్యే ‘బాలకృష్ణ’ను నానా తిట్లు తిట్టారు.నోటికి పట్టరాని విధంగా దూషించారు. సరే..‘పవన్‌కళ్యాణ్‌’ కోసం ఈ ఎంపికపై ‘టిడిపి’ కార్యకర్తలు నోరు మెదపకపోయినా..ఇప్పుడు ‘బిజెపి’ నిర్ణయించిన ‘సోము వీర్రాజు’పై మాత్రం తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘సోము’కు ఎమ్మెల్సీ ఎలా ఇస్తారంటూ..పార్టీ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఆయన సగం..‘బిజెపి’…సగం ‘వైకాపా’ అని..అటువంటి వ్యక్తిని ఎలా ఎమ్మెల్సీని చేస్తారంటూ..వారు అధినేత ‘చంద్రబాబు’ను నిలదీస్తున్నారు. టిడిపి, బిజెపి పొత్తును వ్యతిరేకించిన ‘వీర్రాజు’ ఇప్పుడు పొత్తులో భాగంగా సీటు ఎలా తీసుకుంటారని ధ్వజమెత్తుతున్నారు. తమ రెక్కల కష్టంతో అధికారంలోకి వస్తే..ఇలా టిడిపి వ్యతిరేకులను నెత్తికెక్కించుకోవడం ఏమిటని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే..వారు ఎంత మొత్తుకున్నా..ఆవేదన వ్యక్తం చేసినా..ఇక్కడ ‘చంద్రబాబు’చేసే దేమీ లేదని, కూటమి పొత్తులో భాగంగా ఆయా పార్టీలకు సీట్లు ఇచ్చారని, వారు వారి పార్టీలో ఎవరికి కేటాయించినా..అడిగే అధికారం ‘టిడిపి’కి, ‘చంద్రబాబు’కు లేదంటున్నారు. గతంలో ‘చంద్రబాబు’ ‘మోడీ’పై విమర్శలు చేశాడు..కదా..మరి ఇప్పుడు ‘చంద్రబాబు’కు సిఎం పదవి వద్దంటే..సరేనా..? అంటూ ‘బిజెపి’లో ‘సోము’ను సమర్థించే నేతలు వాదిస్తున్నారు. గతంలో ఎన్నో విమర్శలు చేసుకున్నా..అది అప్పటి పరిస్థితుల్లోనేనని..ఇప్పుడు అవి వర్తించవని వారు అంటున్నారు. కూటమి సజావుగా సాగాలంటో..ఇలాంటివి తప్పవని..దీన్ని ‘టిడిపి’ శ్రేణులు అర్థం చేసుకోవాలని వారు చెబుతున్నారు. కాగా..తమను, తమ అధినేతను దూషించిన వాళ్లే..ఇప్పుడు అందలం ఎక్కడంపై ‘టిడిపి’ శ్రేణులు తీవ్ర ఆగ్రహం, ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.

Featured ఆంధ్రప్రదేశ్

బీద శ్రమ ఫలించింది

తెలుగుదేశం పార్టీ అధినేత ‘నారా చంద్రబాబునాయుడు’ మరోసారి తన పాత పద్దతులనే అవలంభించారు. ఆఖరి నిమిషం వరకూ అభ్యర్ధులను ప్రకటించకుండా..నాన్చి…నాన్చి..చివరకు అభ్యర్థులను ప్రకటించే తన పాత వ్యూహాలనే ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో పాటించారు. ఎన్నికలు ఏవైనా..టిడిపి అధినేత ‘చంద్రబాబు’ తన అభ్యర్థులను ఆఖరి నిమిషం వరకూ టెన్షన్‌ పెడతారు. ఎన్నో ఆశలతో రంగంలోకి దిగిన వారంతా ఆఖరి నిమిషం వరకూ తమకు అవకాశం వస్తుందేమోనని ఎదురు చూస్తుంటారు. చివరకు ఏవో కారణాలతో..వారికి అవకాశం ఇవ్వలేదని చెప్పడంతో వారంతా నిరుత్సాహానికి గురవుతారు. ఇప్పుడు పాత పద్దతినే ‘చంద్రబాబు’ పాటించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ‘చంద్రబాబు’ ఆఖరి నిమిషంలో ఎవరూ ఊహించని వారిని ఎంపిక చేసి..పార్టీ శ్రేణులను, నాయకులను, కార్యకర్తలను ఆశ్చర్యంలో ముంతెచ్చారు. చివరకు కొన్ని కులాలు కూడా షాక్‌ ఇచ్చారు. మ్మెల్సీ నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ‘కమ్మ’, ‘కాపు’ సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇస్తారని భావించగా, ‘చంద్రబాబు’ మాత్రం వారిని వదిలేసి ‘బీసీ’లకు, ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఉంటే..దీనిలో ఒకటి ‘జనసేన’కు పోయింది. ఈ సీటును ‘జనసేన’ ‘పవన్‌ కళ్యాణ్‌’ సోదరుడు ‘నాగబాబు’కు కేటాయించింది. ‘నాగబాబు’ ఒకటిపోగా..మిగతా నాలుగూ ‘టిడిపి’కి వస్తాయని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే..ఈ నాలుగులో మరో సీటు ‘బిజెపి’కి కేటాయించారు. దీంతో..ఇప్పుడు ‘టిడిపి’కి మూడు సీట్లు మాత్రమే మిగిలాయి. అయితే..ఈ మూడు సీట్లలో ఒకటి ‘కమ్మ’ సామాజికవర్గానికి, మరోటి ‘కాపు’ సామాజికవర్గానికి, ఇంకోటి ‘బీసీ’లకు ఇస్తారని పార్టీ శ్రేణులతో పాటు, విశ్లేషకులు భావించారు.ముఖ్యంగా ‘కమ్మ’ల్లో విపరీతమైన పోటీ ఉంది. ఈ సామాజికవర్గంలో దాదాపు పది మంది ఎమ్మెల్సీ సీటు కోసం పోటీపడ్డారు. ముఖ్యంగా మాజీ మంత్రులు ‘దేవినేని ఉమామహేశ్వరరావు, నెట్టెం రఘురామ్‌’ల్లో ఒకరికి ఎమ్మెల్సీ ఖరారైందని ప్రచారం సాగింది. వీరితో పాటు ‘కాపు’ సామాజికవర్గానికి చెందిన ‘వంగవీటి రాధాకృష్ణ’కు కూడా అవకాశం ఉందని భావించారు. వీరు కాకుండా ‘పీఠాపురం’ మాజీ ఎమ్మెల్సీ ‘వర్మ’ ‘టిడి.జనార్థన్‌లకు అవకాశం ఉంటుందని భావించారు. అయితే..ఈ పేర్లేమీ లిస్టులో లేవు. ఎవరూ ఊహించని విధంగా మాజీ స్పీకర్‌ ‘ప్రతిభాభారతి’ కుమార్తె ‘గ్రీష్మ’కు ఎమ్మెల్సీ సీటును కేటాయించారు. ఈమె ఇప్పటికే ఓ నామినెటేడ్‌ పోస్టులో ఉంది. కాగా ‘నెల్లూరు’కు చెందిన ‘బీద రవిచంద్ర’, ‘బిటి నాయుడు’లకు అవకాశం ఇచ్చారు. వీరిలో ‘గ్రీష్మ’ ఎస్సీ  కాగా, మిగతా ఇద్దరు బీసీ వర్గానికి చెందిన వారు. బీసీపార్టీగా చెప్పుకునే ‘టిడిపి’ బీసీలకు మంచి అవకాశాలనే ఇచ్చింది. అయితే..ఇప్పటికే నామినెటెడ్‌ పోస్టులో ఉన్న ‘గ్రీష్మ’కు సీటు ఇవ్వడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. కాగా ‘చంద్రబాబు’ తన నిర్ణయాలతో అటు స్వంత పార్టీ నాయకులే కాకుండా సోషల్‌ మీడియా, ప్రధాన మీడియాకు షాక్‌ ఇచ్చారు. సోషల్‌ మీడియా కానీ, ప్రధాన మీడియా కానీ..ఈరోజు ఎమ్మెల్సీగా ఎంపిక అభ్యర్థులను సూచనా మాత్రంగానైనా అంచనా వేయలేకపోయింది.  మరోవైపు ఎంపికై ముగ్గురు ‘లోకేష్‌’ వర్గానికి చెందిన వారనే ప్రచారం జరుగుతోంది. ‘లోకేష్‌’ టీమ్‌ అయినందువల్లే వీరికి అవకాశం వచ్చిందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

Featured

గొప్ప పరిశోధకుడు ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్ ——————— రచన-ఫయాజ్ ——————— (పున్నమి    భలే జ్ఞాపకాలు) “ఏమయ్యా కొండయ్య?, నేను ఇచ్చిన కాటుక పెట్టుకున్నావా? ఇప్పుడు కళ్ళకు ఎలా కనిపిస్తోంది?” “చాలా బాగా కనిపిస్తుంద య్యా, ఇంతకు ముందు నా కళ్ళ ముందు రెండు తెరలు అడ్డంగా ఉండి ప్రతి వస్తువు లీలామాత్రం గానే కనిపించేది. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనయ్యా” ఈ సంభాషణ మీకు అర్థం కాలేదు కదూ? 70 ఏళ్ల కిందట ఉదయగిరిలో జరిగిన సంఘటన ఇది. ఒక వ్యక్తికి రెండు కళ్ళకు కేటరాక్ట్ వచ్చింది. వెంటనే ఉదయగిరి లోని గొప్ప వైద్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్ ను సంప్రదించాడు. ఆయన ఒక కాటుకను తయారు చేసి ఇచ్చారు. దాని మూలంగా కంటి ముందు ఉన్న కాటరాక్ట్ పొరలు తొలగి పోయాయి. చూపు స్పష్టంగా వచ్చింది. మరో సంఘటన “ఏమమ్మా రసూల్ బి?, నువ్వు అడిగిన దానికి మందిచ్చా గదా. అది పని చేసిందా?, మళ్లీ ఎందు కొచ్చావు?” “అయ్యా మీరిచ్చిన మందు చాలా బాగా పని చేసింది. నా బిడ్డకు కడుపునిండా పాలివ్వగలుగుతున్నా. అయితే పాలిచ్చిన తర్వాత కూడా పాలు ఆగడం లేదు. నా రవిక తడిసిపోతోంది.ఏం చేయాలి”?. “సరే రేపు రా. దానికి పరిష్కారం చెబుతా.” ఉదయగిరి లోని దిలావర్ భాయ్ వీధికి చెందిన ఈ మహిళకు కాన్పు తర్వాత పాలు రాలేదు. అందుకని ఆమె ఉస్తాద్ ను సంప్రదించారు. ఇలా ఉదయగిరి పట్టణంలోనూ, చుట్టుపక్కల బద్వేలు, కనిగిరి, కావలి, ఆత్మకూరు తాలూకాల్లో ఇతర ప్రాంతాల్లో అంతు పట్టని ఏ రోగమొచ్చినా ఉస్తాద్ (గురువు గారు) ని సంప్రదించి ఉచితంగా వైద్యం పొందేవారు. అరుదైన రోగాలకు సైతం ఆయన మందులిచ్చేవారు. ఈ విషయంలో ఆయన కొన్ని పరిశోధనలు సైతం చేశారు. తాను చేసిన పరిశోధనా ఫలితాలను పుస్తకాల రూపంలో రాశారు. ఆయన మూలికల కోసం ఉదయగిరి దుర్గం మీద రెండు మూడు రోజులు ఉండేవారట. కొన్ని పుష్పాలు అర్ధరాత్రి తర్వాత వికసిస్తాయని వాటిని అప్పుడే గుర్తించి సేకరించగలమని చెప్పేవారట. గొప్ప పఠనాభిలాషి. కొన్ని వందల పుస్తకాలను సేకరించారు. ఎన్నో వైద్య గ్రంథాలనూ సేకరించారు. ఆయన పేదవాడైనా వైద్యానికి ఎవరి దగ్గర ఒక్క పైసా తీసుకోలేదు. ఎంతో ఆత్మగౌరవంతో బతికేవారు. దిలావర్ భాయి వంశానికి చెందిన సత్తార్ హుస్సేన్ కుమారుడు ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్. ఉస్తాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఉర్దూ పండితుడు. తెలుగు, సంస్కృతం, అరబ్బీ, పార్సి భాషల్లోనూ మంచి ప్రవేశముండేది. ఉర్దూ, తెలుగుల్లో కవితలు, గీతాలు రాసేవారు. వాటికి తానే స్వరకల్పన చేసేవారు. అసువుగా కవిత్వం చెప్పేవారు. ఒకే సమయంలో అటు ఉర్దూలోనూ ఇటు తెలుగులోనూ అశువుగా కవిత్వం చెప్పేవారు. మొదట ఉర్దూలో చెప్పాక అక్కడ తెలుగు వారుంటే అదే భావాన్ని తెలుగు కవితా రూపంలో చెప్పేవారు. ఇందులో కొన్నిసార్లు విమర్శ లుండేవి. ఆ విమర్శలు చేసేటప్పుడు ధనిక, పేద తేడా లేదు. మనసుకేమనిపిస్తే ఉన్న పళంగా చెప్పేవారు. ఆయన ఏం చెప్పినా తిరుగు ప్రశ్నించే ధైర్యముండేది కాదు. నీతి, నిజాయితీ, ఆత్మగౌరవంతో ఉండేవారు. ఆయన మాట్లాడేటప్పుడు అసంబద్ధంగా ఎవరైనా మాట్లాడితే చీల్చి చెండాడేవారు. ఆయన కోపం లో తిట్టినా ఎవరు ప్రశ్నించేవారు కాదు. ఆనాటి జమీందారులు, షావుకారులూ మినహాయింపు కాదు. ఆయనపై చాలా గౌరవభావం ఉండేది. దానికి తోడు ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలవారు. ఆకలితో ఉన్నా ఎవరి దగ్గర చేయి చాచేవారు కాదు. మంచి వక్త, టీచర్ ఉదయగిరి లోని దిలావర్ భాయి వీధిలోని సత్రంలో ఉస్తాద్ పాఠాలు చెప్పేవారు. ఉర్దూ, తెలుగు, లెక్కలు బోధించేవారు. ఈ పాఠశాల సాయంత్రం నడిచేది. ఇందులో పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొనేవారు. ఊళ్లో అందరూ చదువు కోవాలని భావించేవారు. అందులో భాగంగానే ఈ ప్రయత్నం చేశారు. ఆయన దగ్గర చదువుకున్న ఒకరిద్దరు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు. ఉస్తాద్ గొప్ప రచయిత ఉస్తాద్ గొప్ప కవి. సంగీత, సాహిత్య ప్రియుడు. రచయిత. ఉర్దూలో, తెలుగులో చాలా పుస్తకాలు రాశారు. ఏ భాషలో రాసినా అక్షరాలు ముత్యాల్లా ఉండేవి. ఆకులు అలములతో ఇంకును, పాళీలను తయారు చేసుకునేవారు. అది ఎలా తయారు చేయాలో కూడా రాసి పెట్టారు. ఆధ్యాత్మిక భావనలతో ఉండేవారు. ఈయన నాటక రచయిత. వీరి కలం పేరు ఖాక్సర్. ఉదయగిరిలో మొదట ఉర్దూలో నాటకాన్ని రాసి తన శిష్యులతో ప్రదర్శించారు. అలాగే వీధి ప్రదర్శనలు చేసేవారు. ముఖ్యంగా మీలాద్- ఏ- నబి (మహా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జయంతి) రోజున ఆయనపై స్తోత్రాలు రాసి బాణీలు కట్టి శిష్యులతో పాడించేవారు. హజరత్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ సా వలి దర్గా వద్ద జరిగే ఉరుసు లోనూ, మొహరం వేడుకల్లోనూ వీధి ప్రదర్శనలు సాగేవి. ఇందులో “కర్బలా ధర్మ యుద్ధం” ఎలా జరిగిందో ఆయా పాత్రధారులతో కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించేవారు. ఇది కరుణ రసంతో నిండి ఉండేది. ఉదయగిరి జమీందారు ఛాబు సాబ్ దీన్ని చూసి కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా కొన్ని బహుమతులు కూడా ఆయన బృందానికి అందజేశారట. ఉస్తాద్ మంచి గాయకుడు. గాత్ర శుద్ధి ఉండేది. స్వరకర్త. సంగీతంపై మంచి అవగాహన ఉండేది. ఈయన పిల్లలకు సంగీత పాఠాలు నేర్పేవారు. మొదట రాగం పేరు చెప్పి ఎలా పాడాలో పాడి వినిపించేవారు. తర్వాత దానిని అనుసరించమని చెప్పేవారని ఉదయగిరి లోని దిలావర్ భాయ్ వీధికి చెందిన గౌస్ బాషా (89) తెలిపారు. ఆయన రాగాల పేర్లు చెబుతుంటే ఆయనకంతటి సంగీత జ్ఞానం ఎలా అబ్బిందో అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. మేము ఈ పాటలను మొహరం సందర్భంలో పాడే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. ఉస్తాద్ శిల్పి, చిత్రకారుడు ఎటువంటి పదార్థాలతో నైనా బొమ్మలను తయారు చేసేవారు. ఆయన ఏ రూపం అనుకుంటే ఆ రూపాన్ని తనకు అందుబాటులో ఉన్న పదార్థాలతో తయారు చేసే వారు. ఉస్తాద్ మంచి చిత్రకారుడు. ఎన్నో చిత్రాలను గీశారు. తను రాసిన చాలా పుస్తకాల్లో చిత్రాలను గీసి వాటికి వివరణ ఇచ్చారు. ఎన్నో సందర్భాల్లో ఈయన చిత్రాలను గీసేవారు. అవి అందర్నీ అబ్బురపరిచేవి. ప్రస్తుతం కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉస్తాద్ వృత్తిరీత్యా గుర్రపు నాడాల తయారి, చెక్క నగిషీ పనులు చేసేవారు. ఆయన గుర్రపు నాడాను, మేకులను తయారు చేస్తే మెషిన్ లో తయారు చేసినట్లే ఉండేదని ఇప్పటికీ చెప్పుకుంటారు . చెక్క పై నగిషీ చెక్కడం లో నేర్పరి. ఆయన ఏ పని చేసినా అందులో మాస్టర్ (ఉస్తాద్). అయితే వృత్తిని ప్రవృత్తి మించిపోయేది. రోగుల ఇబ్బందుల దృష్ట్యా ప్రవృత్తిగా ఉన్న వైద్యం, మూలిక వైద్య పరిశోధనలపై ఎక్కువ సమయాన్ని కేటాయించారు. ఆయనకు శరీర ధర్మ శాస్త్రం (అనాటమి)పై గొప్ప అవగాహన ఉండేది. దీనికి సంబంధించి కొన్ని పుస్తకాలు ఉర్దూలో రాశారు. అందులో కొన్ని రేఖా చిత్రాలను కూడా గీశారు. శరీరంలో ఏ అవయవం, ఏ పని చేస్తుందో అందులో రాశారు. అక్కడ సమస్యలొస్తే ఏ విధమైన వైద్యం చేయాలో కూడా వివరించారు. ప్రస్తుతం కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఒక మనిషిని చూస్తే అతనికొచ్చిన రోగమేమిటో ఇట్టే కనిపెట్టేవారు. ఆయన దగ్గరకు వచ్చిన రోగులు తమ బాధేమిటో చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అరుదుగానే కొన్ని ప్రశ్నలడిగేవారు. కొన్ని సందర్భాల్లో ఆయనకు తారసపడిన వ్యక్తుల్లో రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే వాటిని చెప్పేవారు. చిన్నదైతే దానికి సంబంధించిన చిట్కాలు తెలిపేవారు. పెద్దదైతే మందు తయారు చేసిచ్చేవారు. ఆయన వెళ్లే దారిలో ఎవరైనా ఉమ్ము ఊసి ఉంటే అక్కడే నిలబడి పోయేవారు. ఆ ఉమ్మును చూసి ఆ మనిషికి వచ్చిన రోగమేమిటో పక్కనున్న వారికి చెప్పేవారు. కొంతమంది రోగులొచ్చినప్పుడు పరిస్థితి చేయి దాటిందని భావిస్తే మందిచ్చేవారు కాదట. ఆ కాలంలోనే కుష్టు వ్యాధికి మందును కనిపెట్టారు. ఆ మందును ఎలా తయారు చేయాలో రాసి ఉంచారు. ఆయన గొప్ప సైకాలజిస్ట్ కూడా. మనోవ్యాధికి మందు లేదనేది పాత సామెత. అయితే కౌన్సిలింగ్ ద్వారా, కొన్ని కిటుకుల ద్వారా దీనిని నయం చేయవచ్చునని నమ్మేవారు. అదే విషయాన్ని ఆయన గ్రంథస్తం చేశారు. ఆ వ్యాధులను ఎలా నయం చేయాలో ఆచరించి చూపారు. కొన్ని వందల వ్యాధులకు ఆయన దగ్గర చికిత్స ఉండేది. ఎప్పటికప్పుడు వాటిని రాసి ఉంచుకున్నారు. పిల్లలు లేని ఎంతో మంది దంపతులకు తన వైద్యంతో సంతాన ప్రాప్తి కలిగేట్లు చేశారు. ఆయన మనవడు హుస్సేన్ భాష ఆయన రాసి ఉంచిన పుస్తకాలను అనుసరించి ఇప్పుడు వైద్యం చేస్తున్నారు. ఆర్.ఎం.పి సర్టిఫికెట్ తో పాటు ఆయుష్ లైసెన్స్ కూడా పొందారు. తాత గారి బాటలోనే ఇప్పటి దాకా మందు ఖరీదైనది అయితే సామగ్రిని తెప్పించుకొని తయారు చేసి ఉచితంగా ఇస్తున్నారు. గొప్ప కవి ఉర్దూలో ఆయన రాసిన కవిత్వం(భక్తి) ఇప్పటికీ ఖసీదాల (భక్తి గేయాల) రూపంలో ఉదయగిరి తదితర ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది. తెలుగులోనూ కొన్ని రచనలు చేశారు. కొంతమంది శిష్యులు ఆయన మరణాంతరం పుస్తకాలను తీసుకెళ్లారు. ఆయన సంతానం పుస్తకాలను భద్రపరచడంలో తగిన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల అవి అందుబాటులో లేకుండా పోయాయి. ఉస్తాద్ పలు భక్తి గీతాలను రాయడమే కాకుండా స్వరాలను కూర్చారు. అవి ఏ సినిమా పాటలకు అనుసరణ కాదు. అందులోని అర్థం ఇప్పటికీ ప్రశంసనీయమే. ఇస్లామిక్ పండితుడు ఉస్తాద్ ఖాదర్ మోహియుద్దీన్ ఇస్లామిక్ పండితుడు. ఖురాన్ (అల్లా వాక్కు) హదీస్ లు (మహా ప్రవక్త మహమ్మద్ స. అ.వ. స. వారి వాక్కు) లను ఇతర ముస్లిం గ్రంథాలను క్షుణ్ణంగా చదివారు. అంతేకాదు భారత, భాగవతాలను కూడా చదువుకున్నారు. ఉర్దూ పండితులతో పాటు తెలుగు పండితులను కూడా కలిసి చర్చించేవారు. ఆనాటి ఉదయగిరి ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువర్యులు హజరత్

Featured ఆంధ్రప్రదేశ్

APGEA నేతృత్వంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) జిల్లా శాఖ సహకారంతో, మహిళా ఉద్యోగుల స్వచ్చంద భాగస్వామ్యంతో మహిళావిభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. నగరంలోని APSRTC వద్ద గల శ్రీ ఏనుగు సుందరరామిరెడ్డి కల్యాణమండపం నందు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం వరకు జరిగిన ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి శ్రీమతి డాక్టర్ వి.సుజాత, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీమతి డి.తులసి, జిల్లా ఇమ్మ్యూనైజేషన్ అధికారిణి డాక్టర్ ఉమామహేశ్వరి లు హాజరై మహిళా ఉద్యోగులకు స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు చేశారు. తదుపరి అతిథులను మహిళావిభాగం మెమెంటో లు మరియు దుశ్శాలువాలతో ఆత్మీయంగా సత్కరించింది. అలాగే కుటుంబ భారాలు, ఉద్యోగ ఒత్తిడులు మరచి ఉద్యోగినులు ఆటపాటల్లో సేదదీరారు. ఆపై ఆటపాటల విజేతలకు బహుమతిప్రధానం జరిగింది. అనంతరం ఈ వేడుకల నిర్వహణలో విశేష కృషి చేసినవారికి గౌరవ జ్ఞాపికలతో సత్కరించారు.వేడుకలకు హాజరైన ప్రతి ఉద్యోగినికి చక్కని స్నాక్స్, రుచికరమైన భోజనాలతో పాటు APGEA మహిళావిభాగం ఆత్మీయకానుకలు ఇవ్వడం విశేషం. APGEA మహిళావిభాగం చైర్ పర్సన్ శ్రీమతి సుజాతా బాయి మరియు కన్వీనర్ సువర్ణ కుమారిల నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలలో అన్ని శాఖల మరియు అన్ని స్థాయిల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.