సేఫ్టీ పరికరాలు.. ప్రత్యేక వైద్య పరీక్షలకు హామీ
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )
ఏటికొప్పాక: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఏటికొప్పాక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపీపీ రాజన్న శేషగిరిరావు (శేషు) గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో గ్రామ సమస్యలతో పాటు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై చర్చించారు. విధి నిర్వహణలో కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను తెలుసుకుని, వారికి అవసరమైన సేఫ్టీ ఎక్విప్మెంట్ అందించాలని కోరారు. దీనిపై స్పందించిన ఎంపీపీ రాజన్న శేషగిరిరావు (శేషు) కార్మికుల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని అవసరమైన వారిని ప్రత్యేక ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నం స్వరాజరావు, గొంతుమూర్తి కొండయ్య నాయుడు, రావి చలపతి, బజంత్రీల శ్రీను, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


