పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)
యలమంచిలి: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అండగా యలమంచిలి గ్రంథాలయంలో భారీగా స్టడీ మెటీరియల్ అందుబాటులోకి వచ్చింది. పుస్తక పఠనంతో సంపూర్ణ వికాసం సాధ్యమని ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ అన్నారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా శనివారం యలమంచిలి ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. పాఠకుల కోరిక మేరకు రూ.6 లక్షలతో కొనుగోలు చేసిన వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను పాఠకుల సమక్షంలో విడుదల చేశారు.
ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలను ‘ఆన్ డిమాండ్’ విధానంలో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. గ్రంథాలయ యాప్ను మరింత మంది వినియోగించేలా చూడాలని, పాఠకుల సౌకర్యార్థం వైఫై ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు, విశ్రాంత వైస్ ప్రిన్సిపల్ ఆడారి పూరి జగన్నాథ్, సోమయాజుల సన్యాసిరావు, పుల్లా వెంకటరావు, లైబ్రేరియన్ వి. ఆనంద్, విశ్రాంత ఉపాధ్యాయులు వై. అప్పారావు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉద్యోగుల సంఘం ప్రతినిధి ఎన్.వి. నరసింహం తదితరులు పాల్గొన్నారు.


