పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)
ఎలమంచిలి నియోజకవర్గ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్, ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అచ్యుతాపురం ఏపీఐఐసీ సెజ్ అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై మంత్రితో చర్చించారు. సెజ్‌లో పరిశ్రమలకు సంబంధించిన పనులు వేగవంతం కావడంతో పాటు సమస్యల పరిష్కారానికి నూతన జోనల్ మేనేజర్‌ను నియమించాలని వినతిపత్రం అందజేశారు. ఎలమంచిలి నియోజకవర్గ ప్రజలకు సెజ్‌లోని పరిశ్రమల్లో గరిష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కొత్త పరిశ్రమల స్థాపనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి టి.జి. భరత్ సానుకూలంగా స్పందించి, నూతన జెడ్‌ఎం నియామకంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


