సత్తుపల్లి /ఖమ్మం:
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, భూ భారతి చట్టంలోని 22A నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం 9:30 గంటలకు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు తెలిపారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు భానోత్ విజయ్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా బీజేపీ శ్రేణులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు అరెస్టుతో ప్రభుత్వం అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ఎమ్మెల్యేల గొంతు నొక్కలేరని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. సమావేశంలో భాస్కరణి వీరంరాజు, మందా శివ యాదవ్, చీకటి వసంతరావు, సాయి చందర్, ఆచంట సుబ్రహ్మణ్యం, నూతుల కంటి పెద్దిరాజు, బట్టి శివ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



