కూరగాయల కాంట్రాక్టర్, అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే నల్లమిల్లి
అనపర్తి, సెప్టెంబరు 5 (పున్నమి ప్రతినిధి): లక్ష్మీనరసాపురం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిర్వహించిన ఆకస్మిక తనిఖీ నేపథ్యంలో శనివారం సంబంధిత కూరగాయల సరఫరా కాంట్రాక్టర్, సోషల్ వెల్ఫేర్ డీసీవో ఎమ్మెల్యేను కలిశారు. పాఠశాలలో నాణ్యత లేని కూరగాయలు, సరిగా లేని వండిన ఆహారాన్ని గుర్తించిన విషయంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుళ్లిపోయిన ఉల్లిపాయలు, వంకాయలు తదితర కూరగాయలను ఎలా సరఫరా చేశారని కాంట్రాక్టర్‌ను నిలదీశారు. విద్యార్థులు ఆహారం తినలేక డస్ట్‌బిన్‌లో వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అధికారులు ఆలోచించాలన్నారు. పాఠశాల మరమ్మతులకు నిధులు అందిస్తామని, అయితే విద్యార్థుల భోజనంలో నాణ్యత లోపిస్తే మాత్రం క్షమించేది లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీసీవో హామీ ఇచ్చారు.



