ఖమ్మం నగరంలోని హరివిల్లు కన్వెన్షన్ హాల్లోని స్తంభాద్రి సభా ప్రాంగణంలో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో (శనివారం, ఆదివారం) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో సమావేశాల వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యలు, విద్యారంగంలో నెలకొన్న పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే సమావేశాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏబీవీపీ ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన ఉద్యమాలు, కార్యక్రమాలపై సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు.



