సత్తుపల్లి / ఖమ్మం
సత్తుపల్లి: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి నివాసంపై దాడిని నిరసిస్తూ సత్తుపల్లి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వర రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటీశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల కార్యాలయాలు, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులకు స్థానం లేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు, కేసులతో భయపెట్టాలని చూస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై బీజేపీ మరింత ఉధృతంగా పోరాడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, జిల్లా కార్యదర్శి నాగ సురేందర్ రెడ్డి, అల్లిక అంజయ్య పడిగల మధు జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు, జిల్లా అధికార ప్రతినిధి నాగస్వామి తదితరులు పాల్గొన్నారు.



