మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గ మండలంలోనే అధికారుల తీరు ఇదా?
కూసుమంచి, ఆగస్టు 31: ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కూసుమంచి మండల కేంద్రంలో అధికారుల గైర్హాజరుతో వెలవెలబోయింది. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అధికారులు, కనీసం నోడల్ అధికారి కూడా హాజరు కాకపోవడంతో ప్రజాప్రతినిధులు ఖాళీ కుర్చీలకే వినతిపత్రం సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కూసుమంచి ప్రధాన రహదారిపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని టీడబ్ల్యూఎంఎఫ్ జిల్లా ఇన్చార్జి, 8వ వార్డు సభ్యుడు గుండా ఉపేందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా పీఎం శ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు నడిరోడ్డుపై రాకపోకలు సాగించాల్సి వస్తోందని, అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రోడ్డు ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆర్అండ్బీ అధికారులను కోరారు.
“ముఖ్యంగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలోనే ప్రజావాణి పరిస్థితి ఇలా ఉంటే, మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.
ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేసేలా జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని, ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలు అందించే ఆర్జీలను సకాలంలో పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 6వ వార్డు సభ్యుడు చెరుకుపల్లి వీరయ్య, 5వ వార్డు సభ్యురాలు మంద నవ్య చంద్రశేఖర్ గౌడ్, గోపే విజయ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.


